78వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

78వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 78వ రోజుకు చేరింది. ఇన్నిరోజులుగా రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులు. 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. మందడం, తుళ్లూరు, మహాధర్నాలు వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులోని శిబిరాలు జై అమరావతి నినాదాలతో దద్దరిల్లాయి.

ఉద్యమంలో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు, ట్రాక్టర్‌పై ప్రదర్శనలు, రాస్తారోకోలు వంటి ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హనుమాన్ చాలీసా, జలదీక్ష, వంటావార్పు, బ్యాక్‌వాక్ ఇలా రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు రైతులు. పెదపరిమిలో హనుమాన్ చాలీసా పటించారు. సీఎం జగన్ మనసు మార్చాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు.. మహిళా జేఏసీ ఏపీ గవర్నర్‌ను కలిసింది. రాజధానిలో జరుగుతున్న పరిణామాలు, అక్రమ కేసులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అక్రమకేసులు పెడుతున్నారని చెప్పారు. పోలీసులు దాడికి పాల్పడిన ఫోటోలను గవర్నర్‌కు అందజేశామన్నారు. మొత్తం రాజధానిలో 2,800 మందిపై కేసులు పెట్టారని మహిళా జేఏసీ తెలిపింది.

రాజధాని రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరి జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కదిరి రూరల్ మండలం చెర్లోపల్లి జలాశయంలో ఒక్కరోజు జల నిరాహార దీక్షకు దిగారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అటు గుంటూరులోనూ ఉద్యమం జోరుగా సాగుతోంది. అమరావతికి మద్దతుగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు 67వ రోజుకు చేరాయి. అటు ఈ నెల 15న రాజధాని రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న సందర్భంగా షాతో వీరి అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తామంటున్నారు రైతులు. ఇప్పటికీ ఉద్యమం ప్రారంభమై.. 78 రోజులవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దిగిరావడం లేదు. ఇప్పటికైనా జగన్‌ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. తమ ఉద్యమం మరింత ఉదృతం చేస్తామంటున్నారు రైతులు.

Tags

Read MoreRead Less
Next Story