Top

బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎంకి చంద్రబాబు బహిరంగ లేఖ

బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎంకి చంద్రబాబు బహిరంగ లేఖ
X

బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్‌కి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. 26 ఏళ్లుగా బీసీలకు అమల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్లు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వెయ్యాలని కోరారు. జనాభాలో 50%కు పైగా ఉన్న బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రగతికి టీడీపీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందని గుర్తు చేశారు. టీడీపీ 1987లో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలులోకి తెచ్చిందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 26 ఏళ్లుగా ఉందని అన్నారు. 2019 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌, బీసీ సబ్‌ప్లాన్‌ అని చెప్పి, అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు తగ్గించి బీసీలను మోసం చేశారని జగన్‌పై మండిపడ్డారు.

అటు, రిజర్వేషన్ల అంశంలో న్యాయస్థానాల ముందు వాదనలు వినిపించేందుకు పేరున్న న్యాయవాదులను నియమించకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. బీసీ రిజర్వేషన్లపై YCP ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో దీంతో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ తాజా చర్య కారణంగా 33 ఏళ్లుగా బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్‌ ఫలాలు దూరం అవుతున్నాయని అన్నారు. తీవ్ర సమస్యపై అఖిలపక్ష సమావేశం పిలవకుండా, బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని మండిపడ్డారు. బీసీ సాధికారత కాపాడటం ముఖ్యమంత్రిగా జగన్‌ ధర్మమన్నారు చంద్రబాబు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వెంటనే వేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని స్పష్టంగా ప్రకటించారు.

Next Story

RELATED STORIES