తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న 'కరోనా'

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా

చైనా డ్రాగెన్ 'కరోనా' తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. వైరస్‌ భయంతో అన్ని చోట్లా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికి ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా తేలిందని చెప్పిన వైద్యులు.. అతను కోలుకుంటున్నాడన్నారు. జ్వరం తగ్గిందని వివరించారు. మరో 15 మంది నమూనాలపై పుణె వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్‌ కోసం నిరీక్షిస్తున్నారు. ఇద్దరి విషయంలో మాత్రం బాగా అనుమానం ఉన్నా రిపోర్ట్‌ల తర్వాతే ఏంటన్నది ప్రకటన చేస్తారు. ఈ విషయంలో అనవసర ప్రచారం చేసినా, వదంతులు వ్యాపింప చేసినా సరే కేసులు పెడతామని హెచ్చరించారు పోలీసులు.

మైండ్‌స్పేస్‌లో ఉద్యోగినికి వైరస్ సోకినట్టు తేలలేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ గాంధీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ కలకలం నేపథ్యంలో చాలా IT కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతిచ్చాయి. అటు, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనాకి వైద్యం చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 20 బోధనా ఆస్పత్రుల్లోనూ చికిత్సకు ఏర్పాట్లు చేశారు.

స్కూళ్లలోనూ మాస్కులతోనే కనిపిస్తున్నారు విద్యార్థులు. పరిశుభ్రత విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించడంతో స్కూల్ యాజమాన్యాలు కూడా అప్రమత్తం అయ్యాయి. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లోనూ ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ సందట్లో సడేమియా అన్నట్టుగానే మాస్క్‌లకు డిమాండ్‌ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెంచేశారు వ్యాపారులు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కరోనా కలకలం రేపింది. కాకినాడలో ఒకరు, ఏలూరులో ఇద్దరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 8 అనుమానిత కేసులు కూడా ఉండడంతో వైరస్ నిర్థారణ కోసం నమూనాలను హైదరాబాద్‌కు పంపారు. దేశవ్యాప్తంగా 25 మందికి మాత్రమే వైరస్ సోకినట్టు కేంద్రం ప్రకటించింది. ఒక్త బాధితులు లేరని, విదేశాల నుంచి వస్తే పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని కూడా అధికారులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story