కరోనా ఎఫెక్ట్ .. ఇంటర్ పరీక్షల్లో కొన్ని సడలింపులు

కరోనా ఎఫెక్ట్ .. ఇంటర్ పరీక్షల్లో కొన్ని సడలింపులు

తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఒకరికే వైరస్ సోకినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరికి సోకినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కరోనా పాజిటీవ్ అని తేలటంతో ప్రస్తుతం అతనికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేట్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అతను ఈ మధ్య కాలంలో ప్రయాణించిన, కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 47 మందిలో 45 మందికి వైరస్ సోకలేదని తేలింది. అయినా వారిని 2 వారాల పాటు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. మరో ఇద్దరి విషయంలో మరింత క్లారిటీ కోసం పుణెకు పంపించారు.

అటు.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావటంతో సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లో భయాందోళనలు అలుముకున్నాయి. ఆ ఏరియాలో స్కూళ్లన్నింటికీ సెలవులు ఇచ్చేశారు. ప్రజలు చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ సైతం మహేంద్రహిల్స్ ప్రాంతంలో శానిటైజేషన్ చేపట్టింది. జన సమర్ధ ప్రాంతాల్లోనూ ఇక నుంచి శానిటైజేషన్ చేపడతామని ప్రకటించింది. మెట్రోరైళ్లు, స్టేషన్లు వాటి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందితో శానిటేషన్ పనులు చేపట్టారు. రహేజా ఐటీ పార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవలె ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దగ్గు, తుమ్ములతో బాధపడుతుండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో మైండ్ స్పేస్ బిల్డింగ్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించివేశారు. వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశించారు.

కరోనా ఎఫెక్ట్ తో ఇంటర్ పరీక్షల్లో కొన్ని సడలింపులు చేశారు. ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు ముందు బల్లలు క్లీన్ చేయటంతో పాటు విద్యార్థులు సొంత వాటర్ బాటిళ్లు తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. దగ్గు, తుమ్ములతో బాధపడే విద్యార్థులకు వేరే గదిలో పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కరోనా ప్రభావంతో ఆర్టీసీ కూడా అప్రమత్తం అయ్యింది. ప్రయాణీకుల ఆరోగ్యం దృష్ట్యా క్లీన్ - అండ్ గ్రీన్ చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బస్సులను శుభ్రం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story