క్షిపణి పరీక్షలు.. కొరియా ద్వీపంలో మరోసారి కలకలం

క్షిపణి పరీక్షలు.. కొరియా ద్వీపంలో మరోసారి కలకలం

ఉత్తర కొరియా మళ్లీ మొదటికొచ్చింది. క్షిపణి పరీక్షలో కొరియా ద్వీపంలో మరోసారి కలకలం రేపింది. తాజాగా రెండు మిస్సైళ్లను నార్త్ కొరియా పరీక్షించింది. ఆ రెండూ కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లు. వోన్సన్‌ ప్రాంతం నుంచి తూర్పు తీర ప్రాంతం మీదుగా మిస్సైళ్లను ప్రయోగించినట్లు సమాచారం. దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యానికి ఈ క్షిపణులు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఓ కొత్త వ్యూహాత్మక మిస్సైల్‌ను పరీక్షిస్తామని ఇటీవలే ఉత్తర కొరియా ప్రకటించింది. చెప్పినట్లుగానే రెండు క్షిపణులను టెస్ట్ చేసింది.

ఉత్తర కొరియా తీరుపై దక్షిణ కొరియా మండిపడింది. క్షిపణి పరీక్షలతో నార్త్ కొరియా అలజడి సృష్టిస్తోందని ఆరోపించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా ప్రయత్నాలు వేగవంతం చేయాల్సిన సమయంలో మిస్సైల్ టెస్టులు భయాందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. అమెరికా కూడా కిమ్ జాంగ్ ఉన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసింది. 2018 చివరి నుంచి 2019 వరకు అమెరికా, నార్త్ కొరియా మధ్య చర్చలు జరిగాయి. ట్రంప్, కిమ్ జాంగ్‌ ఉన్‌లు మూడుసార్లు సమావేశమై మంతనాలు జరిపారు. మొదటి రెండు సమావేశాలు సక్సెస్ అయినప్పటికీ మూడో భేటీ విఫలం కావడంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తత రాజుకుంది.

Tags

Read MoreRead Less
Next Story