తాజా వార్తలు

తెలంగాణ బడ్జెట్ 2020-21 కు మంత్రి మండలి ఆమోదం

తెలంగాణ బడ్జెట్ 2020-21 కు మంత్రి మండలి ఆమోదం
X

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన తెలంగాణ బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..? ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరపాలిజ..? ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి..? స్వీయ ఆదాయం పెంచుకునే మార్గాలేమిటి..? అనే అంశాలపై సీఎం కేసీఆర్ అనేకసార్లు సమీక్షలు నిర్వహించి వాస్తవిక బడ్జెట్ ను రూపొందించారు

బీసీ సంక్షేమ శాఖలో 'కేసీఆర్‌ ఆపద్బంధు', రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ మినహా.. పెద్దగా కొత్త పథకాలు లేవని సమాచారం. ఉన్న వాటిని కొనసాగిస్తూ, ఆదాయానికి తగ్గట్టుగా వ్యయ అంచనాలు సిద్ధం చేసినట్టు తెలిస్తోంది. ఈసారి కూడా వాస్తవ బడ్జెట్‌నే ప్రతిపాదించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. బడ్జెట్‌ లక్షా 50 వేల కోట్లకు అటు ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం కారణంగా గత 2019-20 బడ్జెట్‌ లక్షా 46 వేల కోట్లుగా ప్రతిపాదించారు. ఈసారి మాత్రం కొత్త పథకాల ప్రకటన లేకుండానే బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమల్లో ఉన్న పథకాలు సక్రమంగా కొనసాగించాలని భావిస్తున్నారు.

గతంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల వయసు తగ్గింపు, రైతు రుణమాఫీ వంటి వాటిని అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. దీనికి అనుగుణంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకే బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు సమాచారం. కేంద్రం నుంచి రానున్న నిధులను బట్టి, బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయం సుమారు లక్ష కోట్లకు చేరుకుంది. గత డిసెంబరు నాటికే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం సుమారు 92 వేల 947 కోట్లుగా నమోదయింది. జనవరిలో వచ్చిన ఆదాయాన్ని కూడా లెక్కిస్తే లక్ష కోట్లకు చేరుకుందని అధికారుల అంచనా. వివిధ మార్గాల ద్వారా సుమారు 21 వేల కోట్ల రూపాయలను రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంది. అయితే వ్యయం కూడా భారీగానే ఉంది. డిసెంబరు నాటికి 86 వేల242 కోట్లు ఖర్చు చేశారు. మరో 6 వేల 794 కోట్ల రూపాయలు రుణాల చెల్లింపునకు వినియోగించారు.

డిసెంబరు నాటికి కొన్ని ముఖ్య విభాగాల నుంచి వచ్చిన ఆదాయం చూస్తే.. జీఎస్టీ ద్వారా 20,348 కోట్ల రూపాయలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ద్వారా 4,865 కోట్లు.. సేల్స్‌ ట్యాక్స్‌ రూపేణా 14 వేల 5 కోట్లు సమకూరింది. ఇక స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు ఇతరత్రాలు కలిపి 9 వేల 32 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 8 వేల 449 కోట్లు.. ఇతర పన్నులు, డ్యూటీలు ద్వారా 3 వేల 559 కోట్లు.. రుణాలు 21 వేల 715 కోట్లుగా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. కొత్తగా ఆదాయం వచ్చే దాన్ని బట్టి కొత్త స్కీములను ప్రవేశపెట్టే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి ఈ ఏడాదికి వాస్తవిక బడ్జెట్టే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గ్రామాల్లో ఎంబీసీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్‌ ఆపద్బంధు’ పేరుతో పథకం ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. ఐదుగురు యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్ లు పంపిణీ ఈ పథకం ఉద్దేశం. పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తవిక బడ్జెట్ ను రూపొందించినట్టు తెలుస్తుంది. ఏడాది అంతా ఆర్థిక మాద్యం ఉన్న నేపథ్యంలో.. గత బడ్జెట్ కంటే 13 శాతం అదనంగా ఉండబోతున్నట్టు సమాచారం.

Next Story

RELATED STORIES