వైసీపీ ఆరాచకాలపై న్యాయ పోరాటం చేసి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి : చంద్రబాబు

వైసీపీ ఆరాచకాలపై న్యాయ పోరాటం చేసి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి : చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా పని చేయాలని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో అన్ని మండలాల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. 38 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నో ఎన్నికలు సమర్ధంగా ఎదుర్కొన్నామని.. కానీ ఈసారి ఎన్నికలను ఎదుర్కోనేందుకు అంతా విరోచితంగా పోరాడాలన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని కేడర్‌కు సూచించారు.

వైసీపీ ఆరాచకాలపై న్యాయ పోరాటం చేసి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు చంద్రబాబు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఉన్నవన్నీ ఊడగొట్టారని.. పేదల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిస్తే ఇక ఏమీ మిగల్చరని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతారనే భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని జగన్ బెదిరింపులు చేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఆడబిడ్డల పోరాటం స్ఫూర్తితో టీడీపీ నేతలంతా పోరాడాలని పిలుపు ఇచ్చారు.

ఓటమి భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని జగన్ బెదిరింపులకు దిగారని విమర్శించారు. ఇక తమ పదవులను కాపాడుకోటానికి వైసీపీ నేతలు అడ్డదారులు తోక్కుతారని జాగ్రత్తగా నిఘా వెయ్యాలని, అవసరమైది వీడియోలు తియ్యాలని, ఎక్కడ డబ్బులు పంచినా వీడియోలు తీసి పంపాలని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిఘా యాప్‌ కు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం ఏమిటని నిలదీశారు. స్థానిక ఎన్నికలపై నిఘా పెట్టేంత అవసరం ప్రభుత్వానికి ఏముందన్నారు. ఎన్నికల్లో గెలిపించకపోతే మంత్రి పదవులు ఊడిపోతాయని సీఎం జగన్ మంత్రులను బెదిరిస్తున్నారని.. ఓటమి భయమే ఇందుకు కారణమని అన్నారు.

బీసీలకు చట్టపరంగా వచ్చే రిజర్వేషన్లను తీసేయడంపైనా ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రబాబు. తప్పుడు విధానాలతో ఈ ప్రభుత్వం బీసీల ద్రోహిగా మిగిలిపోయిందన్నారు.. బీసీలను నమ్మించి ప్రభుత్వం గొంతు కోసిందంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

టీడీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. ట్రస్టుల విషయంలోనూ జోక్యం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత బాబ్జి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని.. వైసీపీ నాయకుల బెదిరింపుల వల్లే అవినాష్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్రం అభద్రతా భావంతో వుందని.. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. మద్యం, నగదు పంచుతుంటే ప్రజలే ఎక్కడికక్కడ పట్టించాలని ఉద్బోధించారు. ఒక్క అవకాశం ఇస్తే ఏమయ్యిందో 10 నెలలుగా చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి మనస్సాక్షితో ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story