తాజా వార్తలు

విషం తాగి ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. ఘటనపై అనుమానాలు

విషం తాగి ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. ఘటనపై అనుమానాలు
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని చింతల్‌బస్తీలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు నెలకొన్నాయి..

మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో దారుణంగా హత్య చేయించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 సెప్టెంబర్‌ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హత్య జరిగింది. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ కేసులోమారుతీరావు జైలుపాలయ్యారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపినట్టు సమాచారం.

మరోవైపు వారం రోజుల కిందట మిర్యాలగూడలోని మారుతీరావుకు చెందిన షెడ్డులో అనుమానాస్పదస్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో లభించింది. జైలు నుంచి విడుదలైన తరువాత మారుతీరావు ఎవరికి, ఎక్కడా పెద్దగా తారసపడకపోవడంతో చనిపోయింది మారుతీరావే అన్నట్లు అప్పట్లో ప్రచారాలు జరింది. ఇలాంటి సమయంలో మారుతి రావు ఆత్మహత్యపై అనుమానాలు ఇంకాస్త పెరుగుతున్నాయి.

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. ప్రణయ్‌ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడన్నారు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె అభిప్రాయపడ్డారు.

మారుతీరావు మృతికి తమ్ముడితో ఆస్తి వివాదాలే కారణం కావొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రణయ్‌ హత్యకు ముందు తన ఆస్తిని తమ్ముడి పేర రాయించిన మారుతీరావు.. ఇటీవల అతడి పేరును తొలగిస్తూ వీలునామా మార్పించారు.. అయితే మారుతీరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన సోదరుడు శ్రవణ్ తెలిపారు.

మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది తేలాల్సి ఉంది. వారం కిందటే మారుతీరావుకు చెందిన షెడ్‌లో ఒక అనుమానాస్పద మృతదేహం లభించడం.. ఇటు ప్రణయ్‌ మర్డర్‌ కేసు విచారణ చివరికి చేరడం.. ఇంట్లో గొవడలు పెరగడం వీటిలో ఏది అతడి ఆత్మహత్యకు కారణమై ఉంటుంది అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Next Story

RELATED STORIES