మధ్యప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

మధ్యప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా
X

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. 15 నెలల కమలనాథ్‌ సర్కారు కూప్పకూలే స్థితికి చేరింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే ఆయన వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఈ ఎమ్మెల్యేలంతా తమ రాజీనామా పత్రాలను ఈమెయిల్‌ ద్వారా గవర్నర్‌కు పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. మరోవైపు.. ఈ ఆరుగురు మంత్రుల్ని తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ.. గవర్నర్‌కు లేఖ రాశారు ‌ ముఖ్యమంత్రి కమలనాథ్‌. దీంతో మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ప్రస్తుతం హోళీ వేడుకల కోసం లక్నో వెళ్లారు. తాజా పరిణామాల గురించి తెలియగానే.. ఆయన భోపాల్‌కు బయల్దేరారు. గవర్నర్‌ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 6 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింధియా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ప్రధానితో భేటీ అనంతరం.. సింధియా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు.. సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఆయనను పార్టీ బహిష్కరించిందని, దీనికి సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

230 శాసనసభ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, బీజేపీ 107 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్సీ ఎమ్మెల్యేలు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు... కమలనాథ్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో.. మొత్తం సభ్యుల సంఖ్య 228 గా ఉంది. ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే అసెంబ్లీ బలం 208కు తగ్గుతుంది. కమల్‌నాథ్‌ సర్కారు గట్టెక్కాలంటే.. 105 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.

Next Story

RELATED STORIES