రోజులు మారుతున్నా వెనక్కి తగ్గని అమరావతి ఉద్యమకారులు

రోజులు మారుతున్నా వెనక్కి తగ్గని అమరావతి ఉద్యమకారులు

రోజు మారుతుంటే వారి ఉద్యమం మరింత ఉధృతమవుతోందే తప్ప.. ఎక్కడా వెనకడుగు పడటం లేదు. 29 గ్రామాల రైతులు, మహిళలు.. దీక్షలు, మహా ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు.. ఉద్యమమే ఊపిరిగా మలుచుకుని రైతులు, మహిళలు రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

అమరావతిని తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని శపథం చేస్తున్నారు.. 5 కోట్ల ఆంధ్రుల కోసం తాము భూములిచ్చామంటున్న 29 గ్రామాల ప్రజలు వైసీపీ కక్షారాజకీయాలకు ఇప్పటికైనా ముగింపు పలకాలంటున్నారు.

మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో దీక్షలు శాంతి మార్గంలో సాగుతున్నాయి. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నామని, పాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతిని చంపేయొద్దని వేడుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో ధర్నాలు చేపడుతున్నారు రైతులు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న భవనాలకు 2 వేల కోట్లు కేటాయించి పూర్తి చేస్తే అమరావతి నుంచే సమర్థంగా పాలన సాగించే వీలుంటుందని, ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటున్నారు రాజధాని రైతులు.

అటు ఈ ఉద్యమంలో మహిళలే ముందుంటున్నారు. ఉద్యమం ప్రారంభమైన రోజునుంచి మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. చావనైనా చస్తాం కానీ.. రాజధానిని ఇక్కడి నుంచి తరలించేందుకు అంగీకరించేది లేదంటున్నారు మహిళా రైతులు.

అమరావతి పరిరక్షణ ఉద్యమం 85వరోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు 3 వేల మందిపై కేసులు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి కేసులు ఇంకెన్ని పెట్టినా ఉద్యమం మాత్రం ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు.. వెనకడుగు వేయబోమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story