స్థానిక ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం

స్థానిక ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం

ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రహసనంలా మారాయి.. బీసీలకు జరిగిన అన్యాయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రిజర్వేషన్ల కుదింపును సాకుగా చేసుకుని స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యాన్ని తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి బీసీ సంఘాలు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు ఇచ్చిన రెండు జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి.. అలాంటి జిల్లాలోనూ స్థానికల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం తగ్గించడం పట్ల అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది.. తద్వారా బీసీల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దోహద పడింది.. కానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరని అన్యాయం జరిగిందనేది బీసీల ఆరోపణ. సుప్రీంకోర్టు నిబంధనలను సాకుగా చూపి.. హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంతో అప్పటి వరకు బీసీలకు కొనసాగుతున్న 34.7 శాతం రిజర్వేషన్లకూ కోత పెట్టింది.. 24 శాతానికి రిజర్వేషన్లు కుదించింది.. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు యధావిధిగా రిజర్వేషన్ అమలు చేయడంతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ లకు దక్కాల్సిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు గణనీయంగా కోతపడింది.

కొత్తగా రూపొందించిన రిజర్వేషన్ జాబితాను రొటేషన్ పద్ధతిలో కాకుండా హడావిడిగా కేటాయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో ప్రకటించిన రిజర్వేషన్ల జాబితా.. తాజాగా ప్రకటించిన జాబితా పూర్తి భిన్నంగా ఉంది.. గతంలో జిల్లాలోని 48 జెడ్పిటిసి, 48 ఎంపిపి స్థానాల్లో బీసీలకు 15 స్థానాలు కేటాయించారు. ప్రస్తుత జాబితాలో మాత్రం జెడ్పిటిసి స్థానాలు తొమ్మిదికి, ఎంపిపి స్థానాలు తొమ్మిదికి తగ్గిపోయాయి. గత రిజర్వేషన్ల జాబితాలో 920 ఎంపిటిసి స్థానాలకు కేటాయింపు చేశారు. కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం, పోలవరంలో రెండు పంచాయతీలు రద్దు వంటివి జరగడంతో ఈసారి 876 స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో గతంకంటే ఎన్నికలు జరిగేవి 44 స్థానాలు తగ్గాయి. 59 శాతం రిజర్వేషన్ ఉన్న సమయంలో జనవరిలో ప్రకటించిన రిజర్వేషన్ల జాబితాలో ఎస్టీలకు 30 స్థానాలు, ఎస్సీలకు 206 స్థానాలు, బీసీలకు 285 స్థానాలు, జనరల్‌కు 399 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు ఎస్టీలకు ఒకటి అటు ఇటుగా 31 స్థానాలు, ఎస్సీలకు 206 స్థానాలుకు గాను 194 కేటాయించగా, బీసీలకు మాత్రం భారీగా కోత విధించారని ఆ సంఘాలు మండిపడుతున్నాయి.

ఎంపీటీసీ స్థానాల్లోనూ జిల్లాలో బీసీలకు అన్యాయమే జరిగింది. గత జాబితాలో 285 స్థానాలు కేటాయించగా ఈసారి 205కు కుదించారు. జనరల్‌కు గత జాబితాలో 399 స్థానాలు ప్రకటించగా ఈసారి 446 స్థానాలకు పెంచారు. ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా తీసుకున్న నిర్ణయమేనని ఆ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నిడమర్రు జెడ్పీటీసీ స్థానం గతంలో బీసీ మహిళకు కేటాయించగా ఇప్పుడు జనరల్‌కు మారింది. ఇలా బీసీలకు కేటాయించాల్సిన స్థానాలు అత్యధికంగా జనరల్‌కు మార్చడం వెనుక దురుద్దేశం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రొటేషన్ పద్ధతిలో జాబితా తయారు చేస్తే బీసీలకు అన్యాయం జరిగే వీలుండేది కాదని, వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాల నేతలు ఫైరవుతున్నారు.. ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అంటున్నారు. కచ్చితంగా బీసీలు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story