జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ

జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం కొనసాగుతోంది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. 15 నెలల కమలనాథ్‌ సర్కారు కూప్పకూలే స్థితికి చేరింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్న ఈ ఎమ్మెల్యేలంతా తమ రాజీనామా పత్రాలను ఈమెయిల్‌ ద్వారా గవర్నర్‌కు పంపారు. అనంతరం అక్కడ్నుంచి హర్యానాకు క్యాంప్ మార్చినట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో ఈ ఆరుగురు మంత్రుల్ని పదవుల నుంచి తొలగించారు సీఎం కమల్ నాథ్. అంతేకాదు, వీరిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ గవర్నర్‌కు లేఖ రాశారు.

ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీని కలిసి.. తాను పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు. ప్రధానితో భేటీ తర్వాతే.. సింధియా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇదిలావుంటే.. జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఆయనను పార్టీ బహిష్కరించిందని, దీనికి సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ స్పష్టం చేసింది.

ఇక, జ్యోతిరాదిత్య రాజీనామాతో కమల్ నాథ్ సర్కార్ దాదాపు కూలిపోయే స్థితికి చేరుకుంది. 24 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ కమల్ నాథ్‌ కు ఆదేశాలు జారీచేశారు. బలాబలాలు పరిశీలిస్తే.. అధికారంలో కొనసాగేందుకు ఏమాత్రం అవకాశం లేదు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం 228 మంది సభ్యులున్నారు. ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతి చెందడంతో సభ్యుల సంఖ్య 228 కి చేరింది.

నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్సీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే కలిసిరాగా.. మొత్తం 114 మంది సభ్యుల మద్దతుతో 15 నెలల క్రితం కమల్ నాథ్ సర్కార్‌ కొలువుదీరింది. 107 మంది సభ్యులతో బీజేపీ ప్రతిపక్షానికి పరిమతమైంది. జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన షాక్‌ తో సభ్యుల సంఖ్య 206 కు తగ్గింది. ఈ నేపథ్యంలో కమల్‌ నాథ్‌ సర్కార్‌ గట్టెక్కాలంటే.. 104 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

అయితే, 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రస్తుతం కాంగ్రెస్ కు 92 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే వుంది. ఈ నేపథ్యంలో 107 సభ్యుల మద్దతు వున్న బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అంతేకాదు, నలుగురు స్వతంత్రులతో పాటు బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ తో భేటీ తర్వాత వీరంతా కమలం పార్టీతో కలిసి నడిచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అటు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర సమావేశానికి 52 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు సమాచారం. దీంతో ఇక కమల్‌ నాథ్‌ సర్కార్‌ పతనం ఖాయమని తేలిపోయింది.

ఇదిలావుంటే, జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపేందుకు కేంద్రం పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా జరిగే రాజ్యసభ ఎన్నికల్లోనే జ్యోతిరాదిత్య సింధియాను నామినేట్ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు, కేంద్రమంత్రివర్గంలోనూ సింధియాకు చోటు కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మేరకు బీజేపీ పెద్దలతో సింధియా అవగాహన కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇక, మధ్యప్రదేశ్ నూతన సీఎంగా బీజేపీ నుంచి నరోత్తమ్ మిశ్రా పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత సంక్షోభంలో ఆయన కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో అతన్నే సీఎం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కే మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా కమలనాథులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story