ఏపీలో ప్రహసనంలా మారిన స్థానిక ఎన్నికలు

ఏపీలో ప్రహసనంలా మారిన స్థానిక ఎన్నికలు

ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రహసనంలా మారాయి.. బీసీలకు జరిగిన అన్యాయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రిజర్వేషన్ల కుదింపును సాకుగా చేసుకుని స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యాన్ని తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి బీసీ సంఘాలు. వైసీపీకి తొలి నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న కర్నూలు జిల్లాలోనూ బీసీలకు అన్యాయం తప్పలేదు. జిల్లాలో 22 లక్షల వరకు ఓటర్లుంటే..అందులో అధికారిక లెక్కల ప్రకారమే 15 లక్షల మంది బీసీ ఓటర్లున్నారు. అంటే జిల్లాలో 50 శాతానికి పైగా బీసీ ఓటర్లే ఉన్నారు. ముఖ్యంగా కోడుమూర్, ఆలూర్, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, పాణ్యం, డోన్, ఎమ్మిగనూర్ సెగ్మంట్లలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయి.

గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండటంతో దామాషా ప్రకారం బీసీలకు అధిక ప్రధాన్యత దక్కింది. 34 శాతం రిజర్వేశన్లకు అనుగుణంగా పదవులు దక్కేవి. కానీ ఇప్పుడు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న న్యాయస్థానం ఆదేశాలతో 34 ఉన్న బీసీ రిజర్వేషన్ల శాతం 24 కి తగ్గిపోయింది. దాంతో పంచాయితీలు, జడ్పిటీసీలు, ఎం.పిటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ వార్డుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. 10 శాతం రిజర్వేషన్లు తగ్గిపోవడంతో జిల్లాలో 1200ల మందికి పైగా బీసీ అభ్యర్థులు పదవులని కోల్పోవాల్సి వచ్చింది..

వైసీపి నేతలు సూచించినట్లుగా అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారన్న విమర్శలున్నాయి. ఫలితంగా ఆయా నియోజకవర్గాలు మండలాల్లో బీసీల ప్రాబల్యం అధికంగా ఉన్నా.. సీటు ఓసీలకు రిజర్వ్ కావడంతో బీసీలు పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆళ్లగడ్డలోని ఆరు మండలాల్లో బీసీలు అధికంగా ఉన్నారు. కానీ రిజర్వేషన్లలో ఆధారంగా జరిగిన కేటాయింపుల్లో ఒక్క సిరివెళ్లలో మాత్రమే బీసీ మహిళ కు రిజర్వ్ చేశారు. బనగానపల్లెలో ఒక్క ఎం.పిటీ.సి.స్థానం కూడా బీసీలకు కేటాయించలేదు. ఇలా పలు మండలాల్లో బీసీలకు అన్యాయం చేశారు..గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పుడు 972 పంచాయితీల్లో 337 స్థానాలు దక్కాయి..కానీ ఇప్పుడు పది శాతం తగ్గిపోవడంతో బీసీలకు 256 స్థానాలు మాత్రమే దక్కాయి..అంటే.80 స్థానాల్లో పదువులు కోల్పోవాల్సి వచ్చింది..

2014లో 34 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 21 ఎం.పీ.పీ స్థానాలు దక్కాయి. అదే ఇప్పుడు పది శాతం రిజర్వేషన్లు తగ్గి పోవడంతో బీసీలకు 16 ఎం.పీ.పీ స్థానాలే మిగిలాయి. అంటే 5 స్థానాలను బీసీలు కోల్పోవాల్సి వచ్చింది. జడ్పిటీసీల రిజర్వేషన్లలో ఇదే విధంగా అన్యాయం జరిగింది. 2014లో 52 మండలాల్లో 22 స్థానాలు బీసీలకు రిజర్వ్ కాగా..ఇప్పుడు 16కి తగ్గిపోయాయి. MPTCల విషయానికి వస్తే 2014లో 766 స్థానాల్లో 302 స్థానాలను కేటాయించారు. కానీ, ఇప్పుడు 788 ఎంపీటీసీ సీట్లకుగాను 206 ఎం.పి.టీసీ స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. అంటే 100 కి పైగా ఎంపిటీసీ రిజర్వ్ సీట్లను బీసీలు కొల్పోయారు.

దీంతో బీసీలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు..రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు పదవులు రాకుండా మోసం చేసి జగన్ కి బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story