గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో చంద్రబాబు సమావేశం

గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో చంద్రబాబు సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల్ని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకప్పుడు తప్పుచేయాలంటే భయపడేవారని, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను కూడా లెక్కచేయడం లేదని ఫైరయ్యారు. కులం, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కొన్ని చోట్ల కావాలనే టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశమైన చంద్రబాబు.. వైసీపీ సాగిస్తున్న అరాచకాలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు. ఇంతా జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలను మీడియాకు చూపించారు.

వైసీపీ అరాచకాలపై ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. 13 జిల్లాల పరిధిలోని 154 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు రీషెడ్యూల్‌ చేయాలని పేర్కొన్నారు. ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనూ నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ కేసులు, నామినేషన్‌ పత్రాల చింపివేత వంటి చర్యలపైనా టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ దౌర్జన్యకాండ కొనసాగిందని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని కోరారు. రిటర్నింగ్‌ అధికారులు సకాలంలో నో డ్యూ.. కుల దృవీకరణ పత్రాలు అందచేయలేదని.. ప్రతిపక్షాల నామినేషన్లను అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారపార్టీ దౌర్జన్యకాండకు కొన్ని చోట్ల ఓ వర్గం పోలీసులు సహకరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆ దాడులకు సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఈసీకి లేఖ రాశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story