కరోనా ప్రభావం.. కఠిన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం

కరోనా ప్రభావం.. కఠిన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం

మనదేశంలో కరోనా ప్రభావం ఎక్కువవుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 73 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారించారు. ఇందులో 56 మంది భారతీయులు. 17 మంది విదేశీయులు. తాజాగా ముంబై లో 2 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటితో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 11కు పెరిగింది. పుణేలో-8, ముంబైలో ఇద్దరు, నాగపూర్‌లో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. కేరళ, యూపీ , తెలంగాణ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటకల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి తీవ్రత దృష్ట్యా హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాను ఎపిడమిక్‌గా ప్రకటించింది. ఇప్పటికే 44 మంది అనుమానితుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అందులో 38 మందికి నెగెటివ్ అని వచ్చింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. చైనా, ఇరాన్, ఐరోపా దేశాలు, దక్షిణ కొరియాలకు అత్యవసర పనులు ఉంటేనే వెళ్లాలని ఆదేశించింది. ఇలాగే, విదేశాల నుంచి మనదేశానికి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు పెట్టింది. ఏప్రిల్ 15 వరకు పర్యాటక వీసాలను రద్దు చేసింది. మార్చ్ 13 నుంచి మొదలయ్యే ప్రయాణా లకు ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే, విమానాశ్రయాల్లో స్కీనింగ్‌ను పక్కాగా అమలు చేస్తు్ననారు. ఇప్పటి వరకు 10 లక్షల 60 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. అలాగే, కరోనాను అంతర్జాతీ య మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 10 కింద చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎపిడెమిక్‌ డిసీజెస్‌ చట్టం సెక్షన్‌ రెండును ప్రయోగించాలని రాష్ట్రాలనూ కేంద్రం కోరింది.

కరోనా వ్యాప్తి ఆందోళన కలిగించే అంశమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ప్రజలంతా అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్‌లో 6 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారని తెలిపిన జైశంకర్, అక్కడి నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటలీకి కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని పంపుతున్నామని తెలిపారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.

కరోనా ఎఫెక్ట్‌ ఇండియా టూరిజంపై బలంగా పడుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు 70 వేల మంది వచ్చేవాళ్లని, ఇప్పుడు ఆ సంఖ్య 62 వేలకు పడిపోయిందని కేంద్రం తెలిపింది. ఈ సంఖ్య మున్ముందు 40వేలకు పడిపోయే అవకాశముందని పేర్కొంది. కరోనా భయం టాక్సీవాలాలు, ఆటో డ్రైవర్లను కూడా వెంటాడుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారిని పికప్ చేసుకోవడానికి టాక్సీవాలాలు, ఆటో డ్రైవర్లు ఇష్టపడడం లేదు. ముంబై ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి టాక్సీ-ఆటో డ్రైవర్లు వణికిపోతున్నారు. కరోనా భయంతోనే విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించుకోవడానికి డ్రైవర్లు ముందుకు రావడం లేదని ముంబై ఆటోరిక్షా మెన్స్ యూనియన్ పేర్కొంది. టాక్సీ డ్రైవర్లకు మాస్క్‌ల తోపాటు శానిటైజర్స్ అందించాలని విజ్ఞప్తి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story