భారత్ లో రెండుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

భారత్ లో రెండుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
X

చాప కింద నీరులా కరోనా వైరస్ రోజు రోజుకీ విస్తరిస్తోంది. దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకి చేరింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన మహిళ, కుమారుడు గత నెలలో సిట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి తిరిగి భారత్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కోవిడ్ 19 పాజిటీవ్ రావటంతో ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే మృతురాలికి షుగర్, బీసీ కూడా ఉండటంతో వైరస్ ను ఆమె శరీరం తట్టుకోలేకపోయింది.

కరోనా దెబ్బకు దేశం మూగబోయింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, నైట్ క్లబ్స్ ఇలా జన సమూహం చేరే ప్రాంతాలను మూసివేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో చాలారాష్ట్రాలు ఇలాంటి చర్యలే చేపట్టాయి. కర్ణాటకలో వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవద్దని, పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

దేశ రాజధాని ఢిల్లీ ప్యానిక్ అవుతోంది. వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేజ్రీవాల్ సర్కారు నిషేధాజ్ణలకు తెర తీసింది. IPL సహా అన్ని రకాల ఆటలను రద్దు చేసింది. సదస్సులు, సమావేశాలను నిషేధించింది. మార్చ్ 31 వరకు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించింది. రాష్ట్రపతి భవన్ సందర్శనను కూడా నిలిపివేశారు. మొఘల్ గార్డెన్స్‌ను చూడడానికి ఎవరూ ఎవరూ రావొద్దని ప్రకటించారు. ఢిల్లీ జేఎన్‌యూలో తరగతుల ను రద్దు చేశారు.

కేరళ, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు ప్రకటించాయి. కేరళలో అసెంబ్లీ సమావేశా లను నిరవధికంగా వాయిదా వేశారు. పథనంతిట్ట పరిసర జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. బిహార్‌లో ఆవిర్భావ దినోత్సవాలను రద్దు చేశారు. మార్చ్ 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిం ది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా స్కూల్స్, కాలేజీలను మూసివేస్తోంది. మార్చ్ 22 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ప్రారంభమైన పరీక్షలు కొనసాగుతాయని తెలిపిన ప్రభుత్వం, ప్రారంభం కాని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఒడిశా ప్రభుత్వం కరోనా వైరస్‌ను విపత్తుగా ప్రకటించింది. అసెంబ్లీని మార్చి 29 వరకు వాయిదా వేసింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 81కు పెరిగింది. బెంగళూరులోని గూగుల్ ఆఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతనితో సన్నిహితంగా తిరిగిన వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు. కంపెనీలో పని చేస్తున్న 707 మంది ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. దీంతోపాటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని గూగుల్ యాజమాన్యం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో 11 మందికి కరోనా వైరస్‌ సోకింది. మహారాష్ట్ర-పుణేలో కరోనా కేసులు పదికి పెరిగాయి. కర్ణాటకలో కరోనాతో మృతి చెందిన వ్యక్తికి వైద్యం చేసినవాళ్లకు కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 50 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తు న్నారు.

కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యావత్ భూమండలం కరోనా వైరస్‌తో పోరాడుతోం దని మోదీ పేర్కొన్నారు. కరోనాపై సమష్టిగా పోరాటం చేయడం ద్వారా సార్క్ దేశాలు మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపు నిచ్చారు. అలాగే, కేంద్రమంత్రులతో అత్యవసరంగా సమావేశ మైన మోదీ, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశీ పర్యాటకులు, విదేశాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు మరింత పెంచారు. ఇప్పటివరకు 11 లక్షల 15 వేల మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు.

Next Story

RELATED STORIES