జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాక్

జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాక్

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సింధియా బీజేపీలో చేరిన రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. గతంలో సింధియాతో పాటు ఆయన కుటుంబసభ్యులపై ఉన్న ఫోర్జరీ కేసును కమల్‌నాథ్ సర్కారు మళ్లీ ఓపెన్ చేసింది. ఫోర్జరీ కేసులో సింధియా ఫ్యామిలీపై పునర్విచారణ జరపాలని ఆదేశించింది. ఈ అంశంపై సింధియా సన్నిహితులు మండిపడ్డారు. రాజకీయ కక్షలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సింధియా తప్పు చేసినట్లుగా ఆధారాలు లేకపోవడం వల్లే గతంలో కేసును మూసివేశారని గుర్తు చేశారు. సింధియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి కేసును రీ ఓపెన్ చేశారని విమర్శించారు.

స్థలం అమ్మకం విషయంలో జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు నమోదైంది. 2014లో సురేంద్ర శ్రీవాత్సవ అనే వ్యక్తి సింధియాపై ఫిర్యాదు చేశారు. 2009లో మహల్గావ్ ప్రాంతంలో సింధియా నుంచి తాను భూమిని కొనుగోలు చేశానని శ్రీవాత్సవ తెలిపారు. ఐతే, డాక్యుమెంట్లలో ఉన్నదానికంటే 6 వేల చదరపు అడుగుల స్థలం తక్కువగా ఉందని ఆరోపించారు. తప్పుడు పత్రాలతో తనకు భూమి అమ్మారని విమర్శించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు, 2018లో కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు శ్రీవాత్సవ మళ్లీ సింధియాపై ఫిర్యాదు చేశారు. గతంలో విచారణ సరిగా జరగ లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story