ఏపీలో ఊహకందని అరాచకాలు.. విస్తుపోతున్న ప్రజానీకం

ఏపీలో ఊహకందని అరాచకాలు.. విస్తుపోతున్న ప్రజానీకం

స్థానిక సంస్థల ఎన్నికలను అధికార వైసీపీ కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఊహకందని అరాచకాలతో విస్తుగొలుపుతోంది. టీడీపీ అభ్యర్థులపై దాడులకు దిగుతూ... కనీసం నామినేషన్‌ వేసేందుతూ అవకాశం ఇవ్వడం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల అధికార యంత్రాంగం సాక్షిగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. 16వ వార్డులో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన శ్రీకాంత్‌పై దాడులకు తెగబడ్డారు. బూతులు తిడుతూ అతని చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. పోలీసుల ముందే ఇదంతా జరిగినా.. వారు చూస్తూ ఉండిపోయారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు ఒకటో వార్డ్‌లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థినిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన విజయలక్ష్మిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించేశారు. తనకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. తనకు జరిగిన అవమానంతో ఆవేదన చెందిన విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంతజరుగుతున్నా పోలీసులు మాత్రం చూస్తూ ఉండిపోయారు.

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అధికార వైసీపీ నేతలు జులుం ప్రదర్శించారు. టీడీపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలు బలవంతంగా లాక్కుని చించేశారు.

తిరుపతి రాయల్‌నగర్‌లోనూ విధ్వంసం సృష్టించారు వైసీపీ కార్యకర్తలు. నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న టీడీపీ అభ్యర్థి ఆనంద్‌బాబును చుట్టుముట్టి నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. పరుష పదజాలంతో దూషిస్తూ మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు..

తిరుపతి ఖాదీకాలనీలోనూ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు రాగా.. వైసీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించేశారు. విషయం తెలుసుకున్న వామపక్షాల నేతలు.. అభ్యర్థికి మద్దతు, వైసీపీ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ అరాచకం తారస్థాయికి చేరింది. టీడీపీ తరఫున ఏ ఒక్కరు నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వారు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చించి.. రణరంగం సృష్టించారు. ధర్మవరంలోనూ టీడీపీ అభ్యర్థి సరళ నామినేషన్‌ వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకుల్లా మారారు.

అనంతపురం జిల్లా గుత్తిలో మున్సిపాల్టి ఎన్నికల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. 10వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు రాగా.. ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరున్న నామినేషన్‌ పత్రాలు చించేసి పారిపోయారు. సాక్షాత్తూ పోలీసుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. 9వ వార్డు టీడీపీ అభ్యర్థి తరపున నామినేషన్‌ వేసేందుకు వచ్చిన మహిళపై దౌర్జన్యం చేశారు. మహిళ చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కుని కాల్వలో పడేశారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయంలోనే బైటాయించి నిరసన తెలిపారు.

నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఎంపీటీసీగా దళిత సామాజిక వర్గానికి చెందిన కట్టా దివ్య నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ వేసినప్పటినుంచి దివ్య తండ్రి కట్టా నాగేశ్వరరావుకు... వైసీపీ నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై నాగేశ్వరరావు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా అధికార పార్టీ నేతల దౌర్జన్యాల మధ్య నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల సమయంలోనే ఇంత అరాచకాలు చేసిన వైసీపీ శ్రేణులు.. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అలజడులు సృష్టిస్తారో అన్న భయాందోళన ఉంది.

Tags

Read MoreRead Less
Next Story