వాహనదారులకు కేంద్రం షాక్.

వాహనదారులకు కేంద్రం షాక్.

కేంద్రం మరో షాక్ ఇచ్చింది. వాహనదారులను మెరుపుదెబ్బ కొట్టింది. పెట్రో ధరల పెంపు దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై 3 రూపాయల చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచేశారు. రోడ్ సెస్‌ పేరుతో సామాన్యులను మరో పోటు పొడిచింది. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ప్రభావానికి లోనవుతున్న కీలక సమయంలో.. అంతర్జాతీయంగా పడిపోతున్న ముడి చమురు ధరలను మరింతగా క్యాష్ చేసుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు 30 డాలర్ల దిశగా పడిపోతోంది. ఈ సమయంలో.. మనదేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అందుకు భిన్నంగా చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. లీటరు పెట్రోల్‌పై స్పెషల్ ఎక్సైజ్‌ డ్యూటీని 2 రూపాయల నుంచి 8 రూపాయలకు, డీజిల్‌పై నాలుగు రూపాయలు పెంచేశారు. ఇక, రోడ్డు సెస్సు విషయానికి వస్తే.. పెట్రోల్‌పై ఒక రూపాయి, డీజిల్‌పై 10 రూపాయలు బాదేశారు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్షలు చేస్తూ.. పెట్రోల్, డీజిల్‌ ధరలను నిర్ణయిస్తుంటాయి. క్రూడ్‌ ధరలు తగ్గిన నేపథ్యంలో.. మనదేశంలోను రేట్లు తగ్గించాల్సి ఉంటుంది. ఆక్రమంలో జనవరి నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి కూడా. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఎక్సైజ్ డ్యూటీ, రోడ్‌ సెస్‌ పెంచింది. పడిపోతున్న ముడి చమురు ధరల ప్రయోజనం సామాన్యులకు తగ్గకుండా కేంద్రం మోకాలడ్డింది. అయితే.. ఈ బాదుడు వల్ల ఇప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేకున్నా.. భవిష్యత్‌లో తడిసి మోపెడు అవడం ఖాయంగా కనిపిస్తోంది.

శనివారం నుంచే పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగించింది. ఖజానాకు రాబడి కూడా తగ్గింది. ఇంకా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలున్నాయి. పెట్రో ఉత్పుత్తులపై పన్ను బాదుడుతో కేంద్రానికి దాదాపు 2 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story