స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆగని వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆగని వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దాడులు, అరాచకాలు పెచ్చుమీరాయి. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల అధికార యంత్రాంగం సాక్షిగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్డడ్డారు. 16వ వార్డులో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన శ్రీకాంత్‌పై పోలీసుల ముందే దాడులకు తెగబడ్డారు. బూతులు తిడుతూ అతని చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ తరఫున ఏ ఒక్కరు నామినేషన్ వేయకుండా హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ నేతలు. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పెద్దారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చించివేసి రణరంగం సృష్టించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు ఒకటో వార్డ్‌లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థినిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన విజయలక్ష్మీ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కొని గొడవ సృష్టించారు. తనకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డ కనికరించలేదు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారు.

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అధికార వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. టీడీపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. నామినేషన్‌ పత్రాలు బలవంతంగా లాక్కుని చించేశారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. 9వ వార్డు టీడీపీ అభ్యర్థి తరపున నామినేషన్‌ వేసేందుకు వచ్చిన మహిళపై దౌర్జన్యం చేశారు. మహిళ చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కుని కాల్వలో పడేశారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మున్సిపల్‌ కార్యాలయంలోనే బైటాయించి నిరసన కొనసాగించారు.

Tags

Read MoreRead Less
Next Story