భారత దేశంలో కోరలు చాచిన కరోనా

భారత దేశంలో కోరలు చాచిన కరోనా

భారత దేశంలో కరోనా కోరలు చాచింది. రోజు రోజుకు స్పీడ్‌గా విస్తరిస్తూ కరతాళ నృత్యం చేస్తోంది. దీంతో కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించింది. వెంటనే అప్రమత్తమై విజృంభణను కట్టడి చేసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలను, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్ములను ఈ నెలాఖరు వరకు మూసెయ్యాలని నిర్ణయించాయి. అత్యధిక జనసమూహం ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పార్లమెంటు ప్రాంగణంలోకి సందర్శకులను నిషేధించారు. సుప్రీంకోర్టులోనూ ముందు జాగ్రత్తగా మరిన్ని ఆంక్షలు విధించారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది.

ఈ జాతీయ విప్పత్తు కట్టడి కోసం రాష్ట్ర ప్రకృతి విపత్తు ఉపశమన నిధి నుంచి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మొదట కరోనా మృతులకు 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు వైద్య ఖర్చులు చెల్లించడానికి అనుమతిచ్చిన కేంద్రం వెంటనే ఆ రెండింటినీ తొలగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. మిగతావారితో కలవనీయకుండా విడిగా ఉంచే వారికి 30 రోజుల వరకు ఆహారం, వస్త్రాలు, వైద్యసేవలు అందించడానికి ఎస్ డీఆర్ ఎఫ్ నిధులు వాడుకోవచ్చని అనుమతిచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ గడువును పెంచుకోవచ్చని చెప్పింది. వీటిపై చేసే వ్యయం ఎస్ డీఆర్ ఎఫ్ వార్షిక కేటాయింపుల్లో 25 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది.

నమూనాల సేకరణ, తనిఖీలు, స్క్రీనింగ్ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖర్చు చేయాలని కేంద్రం పేర్కొంది. అత్యవసర వస్తువుల కొనుగోలు, అదనపు ప్రయోగశాలల ఏర్పాటు, వైద్య, మునిసిపల్ , పోలీసు, అగ్నిమాపక దళ సిబ్బంది రక్షణ కోసం ఉపయోగించే వస్తువులు, థర్మల్ స్కానర్లు, వెంటిలేటర్లు, గాలిని శుద్ధి చేసే పరికరాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపయోగించే వస్తువుల కోసం వ్యయాన్ని అంతా ఎస్ డీఆర్ ఎఫ్ నుంచి మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. దీనికి ఎన్డీఆర్ ఎఫ్ నిధులు ఉపయోగించకూడదని పేర్కొంది.

భారత్‌లో మరో ఇద్దరికి కరోనా సోకడంతో ఇంతవరకు దాని బారిన పడిన వారి సంఖ్య 84కి చేరింది. ఇప్పటికే కరనో కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. యూపీ నుంచి ఐదుగురు సహా మొత్తం 10 మందిని వారు కోలుకున్న తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన 68 ఏళ్ల మహిళకు దిల్లీలో వైద్యవర్గాల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం నుంచి ఇన్ ఫెక్షన్ ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అంత్యక్రియల్లో కొంత జాప్యం జరిగింది.

ఢిల్లీలో స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు మూతపడ్డాయి. గ్రేటర్ నోయిడాలోని అన్ని రకాల స్విమ్మింగ్‌ పూల్స్‌ను ఏప్రిల్ 15 వరకు మూసివేయాలని నిర్ణయించారు. విద్యా సంస్థలు, హోటళ్లు, సొసైటీలు సహా వేర్వేరు చోట్ల ఉన్న అన్ని స్విమ్మింగ్‌ పూల్స్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కేరళలోని వాణిజ్య సముదాయాలు, బీచ్‌లు, జిమ్‌లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విద్యాసంస్థల్ని, సభల్ని ఇప్పటికే రద్దు చేసింది. పంజాబ్ లో సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు, ఈత కొలనులు మూసివేయాలని నిర్ణయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సహా బహిరంగ సభలను రద్దు చేశారు. గోవాలో క్యాసినోలు, పబ్ లను మూసేశారు.

Tags

Read MoreRead Less
Next Story