ఏపీలోనూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోన్న కరోనా వైరస్

ఏపీలోనూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోన్న కరోనా వైరస్

ఏపీలోనూ కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.. ఇప్పటికే నెల్లూరులో ఓ పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. వైరస్‌ ఉందనే అనుమానంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 21కి చేరింది.. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అదనంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చూస్తే 14 మంది అనుమానితులకు ఇప్పటికే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. తాజా లెక్కల ప్రకారం ఆ సంఖ్య 21కి చేరింది.

ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకింది.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.. మరోవైపు సూళ్లూరుపేటలో ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించారు.. వారికి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా స్కూల్స్‌, సినిమా థియేటర్లు బంద్‌ చేశారు.

కడప జిల్లాలోనూ కరోనా అనుమానిత లక్షణాలతో ఇద్దరు రిమ్స్‌లో చేరడం మరింత కలకలం రేపుతోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిద్దరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్‌ పుణె ల్యాబ్‌కు పంపించారు . అటు కర్నూలు జిల్లాలో మూడు అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. వారికి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం విశాఖలో ఐదుగురు అనుమానితులు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది, నెల్లూరులో ఐదుగురు, కడప, అనంతపురంలో ఒకరు చొప్పున ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 70 మందికి టెస్టులు చేయగా.. 57 మంది నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన వారి రిపోర్టులు కూడా ఈరోజు రాత్రిలోగా రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలోనూ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. ఇక్కడ ప్రాథమికంగా పరీక్షలు జరిపి.. పుణె ల్యాబ్‌కు పంపిస్తున్నారు అధికారులు.

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈరోజు సీఎం జగన్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.. కేంద్రం సూచించిన మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు, వైరస్‌ నిరోధానికి రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story