స్థానిక ఎన్నికల రద్దుపై జగన్ వర్సెస్ చంద్రబాబు

స్థానిక ఎన్నికల రద్దుపై జగన్ వర్సెస్ చంద్రబాబు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది మొదలు పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. సినిమాకు మించి యాక్షన్ సీన్లతో పొలిటికల్ స్క్రీన్ పై డర్టీ పిక్చర్ చూపించారు అధికార పార్టీ నేతలు. చివరికి ప్రతిపక్షాలకు నామినేషన్లు వేసే అవకాశం కూడా లేకుండా బరితెగింపు దాడులతో రెచ్చిపోయి..ఏకగ్రీవాలతో క్లీన్ స్వీప్ చేయాలనే కుట్ర చేశారు. అయితే..తానొక్కటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు..కరోనా దెబ్బకు ఎన్నికల వాయిదా పడ్డాయి. వైరస్ ను అడ్డుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. నివారణ చర్యలకు కొనసాగింపుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో వైసీపీ, టీడీపీ మధ్య పెట్రోల్ పోసినట్లు భగ్గుమంది. ఎన్నికల వాయిదా కుట్ర టీడీపీదే అంటూ సీఎం జగన్ తన స్టైల్ ఆరోపణలకు తెరతీశారు. చివరికి ఎన్నికల అధికారికి కూడా కులం మరక పూసేశారు.

అంతేకాదు ప్రపంచం అంతా కరోనాతో గుండెల్లో పిడుగులు పడినట్లు అల్లాడిపోతుంటే..ఏపీ సీఎం మాత్రం కరోనాతో ఇప్పుడొచ్చిన ప్రమాదమేమి లేదని అంటున్నారు. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ ఆరోపణలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అంతే రేంజ్ రియాక్ట్ అయ్యారు. ఒక సీఎం ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు.గత ఎన్నికల ముందు అధికారులను, పోలీసులను ఈసీ తప్పించలేదా? లేదా ప్రశ్నించారు చంద్రబాబు. ఇప్పుడు అదే పని చేస్తే ఈసీని కూడా బెదిరిస్తారా.. హిట్‌లిస్టులోకి చేరుస్తారా అంటూ మండిపడ్డారు.

ఈసీకి కులం మరక అంటించటాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను తాము నియమించలేదని స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు రమేష్‌ కుమార్ నియామకానికి జగన్ కులాలు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఎలక్షన్ల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను కూడా రద్ద చేయాలన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే ఎవేవో ఆరోపణలు చేయటం సరికాదన్న చంద్రబాబు. సీఎంకి ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story