దేశవ్యాప్తంగా 107కు చేరిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా 107కు చేరిన కరోనా కేసులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్ల సంఖ్య 107కి పెరిగింది. ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారు. లేటెస్ట్ గా మహారాష్ట్రలో 12 మందికి, కర్ణాటకలో ఒకరికి, కేరళాలో ఒకరికి, తెలంగాణలో ఒకరికి కోవిడ్-19 పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకు 13 రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 33 మంది, కేరళలో 22 మంది కరోనా బారినపడినట్లు తెలిపింది. హర్యానాలో 14 మందికి కరోనా వైరస్ సోకగా.. వారంతా విదేశీయులేని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6, తెలంగాణలో 3, లఢఖ్‌లో 3, జమ్ము కశ్మీర్‌లో 2, రాజస్థాన్‌లో 2 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో కరోనా పేషెంట్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

కరోనా వైరస్‌ పై పోరాడేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్‌ కూటమి దేశాధినేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. భారత్ తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ పాల్గొన్న ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కోవిడ్-19తో పోరాటానికి ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. దీనికోసం సార్క్ సభ్య దేశాలు విరాళాలు ఇవ్వాలని సూచించారు.

అలాగే భారత్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వయిలెన్స్ పోర్టల్‌ డేటాను పంచుకోవడానికి కూడా మోదీ అంగీకరించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, ఒకరికి ఒకరు అండగా నిలవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.

మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. కేరళ ప్రభుత్వం రోడ్డు మార్గాల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూల్స్, సినిమా థియేటర్లు మూసివేశాయి. జనసమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవటమే మంచిదని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story