మరింత వేడెక్కిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు

మరింత వేడెక్కిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు
X

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ అసెంబ్లీ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతికి సూచించడంతో.. ఇరు పార్టీల వర్గాల్లో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ భోపాల్‌లో కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. అటు, జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ తిరిగి భోపాల్‌కు రప్పించారు. వారందరినీ భోపాల్‌లోని మారియట్‌ హోటల్‌కు తరలించారు.

బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. సోమవారం నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్​లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. అటు విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ విప్‌ జారీ చేసింది. బలపరీక్షపై ఢిల్లీలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నివాసంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, జ్యోతిరాదిత్య సింధియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు భోపాల్‌కు చేరుకున్నారు. బెంగళూరులో ఉన్న 22 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సైతం భోపాల్‌కు చేరుకున్నారు

మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఉంటుందా..? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బలపరీక్ష ఏమీ లేదే అని ఇప్పటికే బాంబు పేల్చారు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ నర్మదా ప్రసాద్‌ ప్రజాపతి. ఒక వేళ బలపరీక్ష ఉంటే.. సభలో తన పాత్రపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక, కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తనను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు స్పీకర్‌. వేరే వ్యక్తుల ద్వారా తమకు రాజీనామా లేఖలు వచ్చాయన్నారు.

22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా స్పీకర్ ప్రజాపతి కేవలం ఆరుగురువి మాత్రమే ఆమోదించారు. మిగిలిన 18 మందిని సస్పెన్స్‌లో ఉంచారు. అసెంబ్లీలో 230 సీట్లు ఉండగా.. ఆ సంఖ్య 222కి పడిపోయింది. అంటే మెజార్టీ మార్క్‌ 112కి చేరింది. బీజేపీకి 107 ఉండగా.. మరో ఐదుగురు సభ్యులు అవసరం.

Next Story

RELATED STORIES