91వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 91వ రోజుకు చేరింది. మా జీవితాలతో పాటు భావితరాలు బాగుంటాయని ఆశపడ్డామని.. వైసీపీ ప్రభుత్వ తీరుతో నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ఏకైక డిమాండ్‌తో రైతులు, కూలీలు, మహిళలు గత 90 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. రాయపూడి, వెలగపూడి, ఎర్రబాలెం, పెదపరిమి, తుళ్లూరు, మందడం, తాడికొండ అడ్డరోడ్డుతోపాటు మిగతా రాజధాని గ్రామాలూ రిలే దీక్షలు, ఆందోళనలతో హోరెత్తాయి.
కరోనా తగ్గాలంటే పారాసిటమాల్ , బ్లీచింగ్ పౌడర్ వాడితే సరిపోతుందని సీఎం జగన్ చెప్పడంపై రాజధాని రైతులు మండిపడ్డారు. మరి మీకు పట్టిన రోగం తగ్గాలంటే ఏం మందులు వాడాలంటూ నిలదీశారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చేతుల్లో పట్టుకుని నిరసన తెలిపారు. అమరావతిలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి సీఎం జగన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
90 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. పట్టించుకోని సీఎం జగన్.. ఎన్నికలు వాయిదా పడితే మాత్రం వెంటనే స్పందించారని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పది నెలల్లోనే జగన్ దుర్మార్గపు పాలన ప్రజలకు అర్థమైందన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆంధ్రుల రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు కట్రపన్నారని మండిపడ్డారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. కేసులు పెట్టి బెదిరించినా, అరెస్టులు చేస్తున్నా, నిరసనలపై ఆంక్షలు విధించినా శాంతియుత మార్గంలోనే దీక్షలు చేపడుతున్నారు రైతులు. చిన్నాపెద్దా తేడాలేకుండా అంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిని రక్షించుకోవడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. ప్రభుత్వం దిగిరావాలని, సీఎం జగన్ మనసు మారాలని పూజలు, హోమాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com