Top

ఏపీలో స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఏపీలో స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ
X

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ SEC వర్సెస్ సర్కార్‌ అన్నట్టుగా మారడంతో వివాదం ఇంకాస్త పెద్దదైంది. ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి వీల్లేదంటూ CMO పట్టుదలగా ఉండడంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినట్టే కనిపిస్తోంది. తాను అనుకున్న పని జరక్కపోయినా, తన మాట నెగ్గకపోయినా CM జగన్ తీరు ఎంత మొండిగా ఉంటుందో ఇప్పటికే చూసిన వాళ్లు.. ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం గవర్నర్‌తో సమావేశం తర్వాత కూడా SEC రమేష్ కుమార్‌ 6 వారాల పాటు ఎన్నికల వాయిదాకే కట్టుబడడం YCPకి మింగుడుపడడం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు EC సుప్రీం అని తెలిసినా సరే ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు చేయాల్సిన CS కూడా తాజా పరిణామాలతో ఇరకాటంలో పడ్డారు. CMO ఆదేశాలతో ముందుకు వెళ్లలేక, అలాగని SEC ఆదేశాలను నిలుపుదల చేయలేక తర్జన భర్జన పడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందుల్లేవంటూ ఇప్పటికే SECకి ఓ లేఖ రాసిన CS సాహ్ని.. తాజాగా అధికారులపై చర్యలు నిలిపివేయాలంటూ కూడా ఇంకో లేఖ రాశారు. నామినేషన్ల సందర్భంగా గుంటూరు, చిత్తూరు జిల్లాలో చెలరేగిన హింసను ఆపలేకపోయారంటూ కొందరిపై SEC చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇద్దరు కలెక్టర్లతోపాటు గుంటూరు రూరల్‌, తిరుపతి అర్బన్ ఎస్పీలను విధుల నుంచి తప్పించాలంది. ఇద్దరు DSPలు, నలుగురు CIలపై కూడా చర్యలకు సిఫార్సు చేశారు. మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలన్నారు. ఇందుకు సంబందించిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్న CS .. ఈ నిర్ణయాలపై పునఃసమీక్షించుకోవాలంటూ SEC లేఖ రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు చివరికి ఎటు దారి తీస్తాయోనని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, అభిసంశన పెట్టి అయినా సరే SEC రమేష్ కుమార్‌ను తప్పించాలని CM భావిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మాజీ ఎన్నికల అధికారులు, న్యాయ నిపుణులతో చర్యలు జరిపినట్టు తెలుస్తోంది.

సోమవారం గవర్నర్‌ని కలిసిన SEC రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా కారణాలను స్పష్టంగా వివరించినట్టు తెలిసింది. ఐతే.. ఈ ఇద్దరి సమావేశంపై అధికారికంగా ఎలాంటి నోట్ మీడియాకు విడుదల కాలేదు. వాయిదాపై యధాతథ స్థితే కొనసాగుతుందని EC వర్గాలు చెప్తున్నా.. ప్రభుత్వం మాత్రం దాన్ని ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే దీనిపై సుప్రీంకి వెళ్లింది. అక్కడ కేసు విచారణ ఎప్పుడొస్తుందని క్లారిటీ లేకపోవడం, హైకోర్టులో దీనికి సంబంధించిన కేసే 19వ తేదీకి వాయిదా పడడంతో నెక్స్ట్‌ ఏంటన్నది గందరగోళంగానే ఉంది.

ZPTC, MPTC ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడడంతో అభ్యర్థులకు ఏమీ పాలుపోవడం లేదు. ప్రస్తుతానికి ప్రచారం ఆపేసినా ఏ క్షణమైనా మళ్లీ ఇంటింటి ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. BJP, CIP లాంటి పార్టీలు ఎన్నికల రీషెడ్యూల్‌కి డిమాండ్ చేస్తున్నా దీనిపై చివరికి ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతుంది. కర్నాటక, మహారాష్ట్రలోనూ స్థానిక ఎన్నికలు వాయిదా పడడం, కోవిడ్‌-19 ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుండడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన AP ప్రభుత్వం మొండిగా ఎన్నికలకు పట్టుపడుతుండడం విమర్శలకు తావిస్తోంది. తప్పు దిద్దుకోకుండా మూర్ఖంగా ఎదురుదాడి చేస్తున్న CMకి ప్రజల ప్రాణాలంటే విలువే లేదని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Next Story

RELATED STORIES