వైసీపీ దాడులను నిరసిస్తూ.. బీజేపీ- జనసేన పోరాటం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు చేసిన దాడులు, దౌర్జన్యాన్ని ఖండిస్తూ బీజేపీ-జనసేన పోరాటాన్ని ఉద్ధృతం చేశాయి. అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. కాళహస్తిలో బీజేపీ నేతలపై దాడులు జరిగాయని ఎస్పీకి చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కరోనా అసలు జబ్బే కాదని సీఎం జగన్‌ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.

సీఎం జగన్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు బీజేపీ నాయకురాలు సాదినేని యామిని. ఎన్నికల కమిషనర్‌కి కూడా కులం అంటగడుతూ జగన్‌ దిగజారుడు రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతలు మౌనదీక్షకు దిగారు. ఏపీలో వైసీపీ దౌర్జన్యకాండను నిలువరించాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బీజేపీ మౌన ప్రదర్శన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. ఎస్‌ఈసీకి రాసిన లేఖను తగలబెట్టారు. ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్‌కు సామాజిక వర్గాన్ని అంటగట్టడం సరైంది కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.

గుంటూరు లాడ్జి సెంటర్, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ-జనసేన నేతలు మౌనదీక్ష చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం సరైందేనని అన్నారు. ఫ్యాక్షన్‌, గుండాయిజం చేస్తూ.. వైసీపీ నాయకులు ప్రత్యర్థులను భయపెడుతున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story