మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో హైడ్రామా

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో హైడ్రామా
X

మధ్యప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం నెలకొన్న వేళ.. హైడ్రామా చోటు చేసుకుంటోంది. కరోనా భయాందోళన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మార్చి 26కు వాయిదా పడటంతో కమల్‌ సర్కారుకు కాస్త ఊరటలభించినట్లైంది. అయితే.. కొన్నిగంటల్లోనే ఈ ఆనందం ఆవిరైపోయింది. మంగళవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనంటూ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ఆదేశించారు గవర్నర్‌ లాల్జీ టండన్‌. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఒక వేళ బలం నిరూపించుకోకపోతే.. ప్రభుత్వం మైనార్టీలో పడిందని పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ... ఈ పది రోజుల సమయంలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చనే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు షాక్‌ తగిలినట్లైంది.

మరోవైపు.. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా 107 మంది ఎమ్మెల్యేలకు గాను.. 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజభవన్‌లో గవర్నర్‌ ఎదుట పరేడ్‌ నిర్వహించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం.. శివరాజ్‌సింగ్ చౌహన్‌ తమకు బలం ఉందని స్పష్టం చేశారు. త్వరగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు కోరినట్లు తెలిపారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కరోనా వైరస్‌ కూడా కాపాడలేదన్నారు బీజేపీ నేత, మాజీసీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌.

సభా సమావేశాలను వాయిదా వేయడంపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బలనిరూపణ చేసుకోవాల్సిన సమయంలో.. సభను వాయిదా వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బల పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో.. ఈ పిటీషన్‌పై మంగళవారం విచారించనుంది అత్యున్నత న్యాయస్థానం.

మరోవైపు సీఎం కమలనాథ్‌లో నివాసంలో.. కాంగ్రెస్‌ నేతలు చర్చలు జరిపారు. కరోనా ఎఫెక్ట్‌తో సభను స్పీకర్‌ వాయిదా వేసినా.. గవర్నర్‌ మాత్రం డెడ్‌లైన్‌ విధించడంతో.. ఆత్మరక్షణలో పడిన హస్తంనేతలు.. దీన్ని ఎలా అధిగమించాలన్నదానిపై చర్చించారు.

మొత్తం 230 మంది సభ్యులున్నమధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఆరుగురు మంత్రులు రాజీనామాలు ఆమోదం పొందడంతో.. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 222కి చేరింది. కమల్‌నాథ్‌ సర్కారు బలపరీక్ష నుంచి గట్టెక్కాలంటే.. కనీసం 112 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 22 మంది ఆయన వెంట వెళ్లారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

Next Story

RELATED STORIES