కమల్‌నాథ్‌ సర్కార్‌ను కాపాడిన 'కరోనా'

కమల్‌నాథ్‌ సర్కార్‌ను కాపాడిన కరోనా

మధ్య ప్రదేశ్‌ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. సోమవారం కమల్‌నాథ్‌ సర్కార్‌ విశ్వాస పరీక్ష ఎదుర్కోక తప్పదని భావిస్తుంటే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్‌ కమల్‌ నాథ్‌ సర్కార్‌ను తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించినా.. స్పీకర్ అందుకు అంగీకరించలేదు. కరోనా కారణం చూపిస్తూ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభను మార్చి 26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రజాపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అంతకుముందు, కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త మహమ్మారిగా నిర్ధారించిందని, ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో.. రాజస్తాన్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని మంత్రి గోవింద్‌ సింగ్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు, మంగళవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ గవర్నర్‌ టాండన్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం మరో లేఖ రాశారు. విశ్వాస పరీక్ష జరపనట్లయితే.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తక్షణమే బల నిరూపణకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు గవర్నర్‌ సభను ఉద్దేశించి ఇచ్చే ప్రసంగం సోమవారం ఒక్క నిమిషం పాటే కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, వాగ్వివాదాల గందరగోళం మధ్య ఒక నిమిషంలోనే గవర్నర్‌ లాల్జీ టాండన్‌ తన ప్రసంగాన్ని ముగించి, వెళ్లిపోయారు. ఆ వెంటనే బల నిరూపణ జరగాలని బీజేపీ చీఫ్‌ విప్‌ నరోత్తమ్‌ మిశ్రా, సభలో విపక్ష నేత గోపాల భార్గవ డిమాండ్‌ చేశారు. తరువాత సభ్యుల గందరగోళం మధ్యనే కరోనా వైరస్‌ ముప్పును శాసనసభ వ్యవహారాల మంత్రి గోవింద్‌ సింగ్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో సభను 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

స్పీకర్‌ నిర్ణయంతో ప్రతిపక్ష బీజేపీ షాక్‌ తింది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నివాసానికి వెళ్లి, తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించాలని అభ్యర్థించారు. మరోవైపు, కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో కర్నాటకలో బీజేపీ నిర్బంధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష రాజ్యాంగవిరుద్ధం అవుతుందని కమల్‌నాథ్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story