ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక సీఎంకి అధికారాలు ఉండవు : విపక్ష నేతలు

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక సీఎంకి అధికారాలు ఉండవు : విపక్ష నేతలు
X

కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తే ఎన్నికల కమిషనర్‌కు కులం అంటగట్టడం దుర్మార్గమన్నారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా రద్దు చేసి.. మళ్లీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌ హుందాతనం కోల్పోయి ఎలక్షన్‌ కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు. కులాన్ని ఆపాదిస్తూ సీఎం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని.. తన నెత్తిమీద తానే చేయిపెట్టుకుంటున్నాడని.. టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కరే ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గదే అన్న జేసీ.. మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందన్నారు.

ఏపీలో రాక్షస పాలన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. చివరకు ఎన్నికల కమిషన్‌ని కూడా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కరోనా వైరస్‌ నేపథ్యంలో తాము గతంలోనే ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్‌ఈసీని కోరినట్లు తెలిపారు.

కరోనా వైరస్‌కు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని జగన్‌ చెప్పడం పిచ్చోడి మాటలేనన్నారు కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్‌. తిరుపతి, తిరుమలలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. ఎన్నికలను పూర్తిగా నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ప్రధాని కూడా ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలకు బద్దుడై ఉంటారని.. ఈ విషయం జగన్‌కు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు నేతలు ఎద్దేవా చేశారు.

Tags

Next Story