ఆరు బిల్లులు, రెండు తీర్మానాలతో తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆరు బిల్లులు, రెండు తీర్మానాలతో తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఎనిమిది రోజుల పాటు సాగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులు ఆమోదం పొందగా.. రెండు తీర్మానాలు, రెండు స్వల్ప కాలిక చర్చలు జరిగాయి. ఈ నెల 6న సభ ప్రారంభం కాగా.. 8న ఆర్థికమంత్రి హరీష్‌ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కరోనా, పల్లెప్రగతి సహా పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగ్గా.. సీఏఏ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడగింపుపై సభ తీర్మానం చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. చివరిరోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడంతో పాటు.. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. పార్లమెంట్‌లో సీఏఏ బిల్లు వచ్చినప్పుడే టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న 8వ రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇప్పటికే బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్‌లు సీఏఏను వ్యతిరేకించి తీర్మానాలు చేశాయన్నారు కేసీఆర్‌.

సీఎం అయిన తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదన్నారు కేసీఆర్‌. అలాంటింది కోట్ల మందికి బర్త్‌ సర్టిఫికెట్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. సీఏఏ అన్నది కేవలం ముస్లింల సమస్యమాత్రమే కాదన్నారు. అయితే ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని దాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. దేశంలోకి చొరబాటుదారులు రాకుండా అడ్డుకోవాల్సిందేనని.. అందుకు టీఆర్‌ఎస్‌ పూర్తిగా సహకరిస్తుందన్నారు.

దేశాన్ని పోషిస్తున్న నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానిది మొదటి స్థానమని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూనే.. దేశాభివృద్ధికి పాటుపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి పెద్దయెత్తున నిధులు మంజూరు చేస్తామని చెబుతున్న కేంద్రం మాటల్లో నిజం లేదన్నారు. రాష్ట్రం నుంచే కేంద్రానికి గణనీయంగా ఆదాయం వెళ్తోందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అట్టడుగు స్థాయిలో వున్న రంగాలు అభివృద్ధి పథంలోకి వచ్చాయన్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో వృద్ధి సాధించిందని తెలిపారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కాగ్ చెప్పిందని గుర్తుచేశారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని అన్నారు సీఎం కేసీఆర్. రెండు పార్టీలు రాష్ట్రాలకు చేసిందేమీ లేదన్నారు. దేశాన్ని డ్రామా కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని కూడా ఎగవేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తాను చొరవతీసుకుని ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు.

పలు అంశాలపై సభ్యులు మాట్లాడిన తర్వాత.. పలు బిల్లులను స్పీకర్‌ పోచారం ఆమోదించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి వున్నా.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముందుగానే సమావేశాలను ముగించారు.

Tags

Read MoreRead Less
Next Story