ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా SECని ఆదేశించాలన్న పిటీషన్‌పై కోర్టు ఏం చెప్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు ఎన్నికల వాయిదాపై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. SEC రమేష్‌కుమార్‌పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది ప్రభుత్వం. అటు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

స్థానిక ఎన్నికల వాయిదాను వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. SEC రమేష్‌ కుమార్‌ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ దగ్గర పంచాయితీ పెట్టిన సీఎం జగన్.. అటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంను కోరినట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పిటీషన్‌ను సీజే బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్యధర్మాసనం విచారించనుంది. దీంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులను సైతం కొట్టివేయాలని సుప్రీంలో పిటీషన్‌ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల కమిషనర్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటీషన్‌లో పేర్కొంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని పిటీషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఎలాంటి సమీక్షసమావేశం నిర్వహించలేదని పిటీషల్‌లో పేర్కొన్నారు. ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు అవసరమని తెలిపింది.

మరోవైపు మంత్రులు తమ అక్కసంతా వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల్ని వాయిదా వేసే హక్కు రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ వివరణ ఇస్తూ రాసిన లేఖపైనా విమర్శలు గుప్పించారు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.

కరోనాపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలతో రాష్ట్రం పరువు పోతోందన్నారు టీడీపీ నేత యనమల. ఈసీపై ఇంత దారుణంగా చౌకబారు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను కేంద్ర బలగాల బందోబస్తుతో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషనర్ ఆదేశించినా.. గుంటూరు, తిరుపతి ఎస్పీలపై ఇంకా ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు టీడీపీ నేతలు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, వ్యవస్థలపై నమ్మకంలేదన్నారు. సీఎం జగన్ ఒక శంకర్‌ దాదా అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కరోనా వైరస్‌తో ప్రజలంతా భయపడుతుంటే.. జగన్‌ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసుల సహకారంతో ప్రతిపక్షం లేకుండా చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story