మలేషియా, ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు ఊరట

మలేషియా, ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు ఊరట

కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయాల్లో రోజంతా పడిగాపులు కాసిన భారతీయ విద్యార్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత.. ఢిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.. కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను కేంద్రం నిలిపివేసింది. దీంతో దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా, తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన స్టూడెంట్స్ ఉన్నారు. మంగళవారం ఉదయమే వీరంతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దాదాపు అర్ధరాత్రి వరకు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది.

కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు 2 నెలలపాటు సెలవులు ప్రకటించాయి. విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో వందలమంది విద్యార్థులు మంగళవారం ఉదయం మనీలా విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా మలేసియాలోని కౌలాలంపూర్‌ మీదుగా భారత్‌కు రావాలి. కొందరు కౌలాలంపూర్‌లో, మరికొందరు మనీలాలో చిక్కుకుపోయారు. అయితే భారత్‌ వచ్చే విమానాలన్నీ రద్దవ్వడంతో వారంతా విమానాశ్రయంలో పడిగాపులు కాశారు. కౌలాలంపూర్‌లో 150 మంది, మనీలాలో 60 మంది చిక్కుకుపోయారు. విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో.. మంగళవారం రాత్రి ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతించారు.

Tags

Read MoreRead Less
Next Story