దేశవ్యాప్తంగా 22 మంది కరోనా బాధితులు కోలుకున్నారు : కేంద్ర ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా 22 మంది కరోనా బాధితులు కోలుకున్నారు : కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా క్రమంగా పంజా విసురుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 223కు చేరిందని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో 32 మంది విదేశీయులు సహా మృతి చెందిన నలుగురు కూడా ఉన్నట్టు వివరించింది. జైపూర్‌లో మృతి చెందిన ఇటలీ వ్యక్తిని ఈ జాబితాలో చేర్చలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 మంది కరోనా బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరందరినీ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది. కోవిడ్ విస్తృతికి అడ్డుకట్ట వేసేందుకు దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది.

కరోనా వైరస్‌ను మరింత సమర్థవంతంగా కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల CSలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను క్రమబద్దీకరించాలని సూచించింది. ప్రభుత్వ ఆఫీసులు పరిశుభ్రంగా ఉంచాలని.. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులతో ఇళ్ల నుంచి పని చేయించుకోడానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. కరోనాపై ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని తెలిపింది. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, అందువల్ల నివారణతో దానిని అరికట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని ప్రజలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం.

ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాన నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా వున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎంలతో చర్చించారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు కూడా పాల్గొన్నారు.

నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.విదేశాల నుంచి వచ్చివారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మోదీ తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్‌కు తరలించాలన్నారు. ఎండలు ఎక్కువగా వైరస్‌ వ్యాపించదని తొలుత భావించాం.. కానీ గల్ఫ్‌ దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉన్న కూడా కరోనా వ్యాపించిందని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

అటు, కరోనా ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు మూసివేయడంతో వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. రెండు వారాలుగా ఫారెన్‌ టూరిస్టులు పెద్దగా లేకపోవడంతో గిరాకీ పడిపోయి.. దుకాణాలు వెలవెలబోతున్నాయి. షాపుల్లోకి వచ్చే వారు సైతం అనుమానంగానే కనిపిస్తున్నారంటూ సేల్స్‌ బాయ్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలోనే దేశంలోనే అత్యధికంగా 51 పాజిటివ్ కేసులో నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నాగ్‌పూర్, ముంబై, పుణే నగరాలను మూసివేసింది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించింది. కరోనా భయంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఇదిలావుంటే, బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా సోకింది. ఆమెకు చేసిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గత ఆదివారం బ్రిటన్‌ నుంచి వచ్చిన కనికా కపూర్.. లక్నోలో పలు ఫైవ్‌స్టార్ హోటళ్లకు వెళ్లింది. పలువురికి పార్టీలు సైతం ఇచ్చిందామె. తాను విదేశాలకు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి పెట్టినట్టు చెప్తున్నారు.

ఈ విషయం తెలీడంతో పలువురు వీవీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆమె ఇచ్చిన పార్టీలకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె తనయుడు-పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్‌ సింగ్, తృణమూల్ ఎంపీ డిరెక్‌ ఒబ్రెయిన్ సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు వెళ్లారు. రాజె తనయుడు దుష్యత్ సింగ్.. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. కనికాకపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో.. ఆమె పార్టీలకు హాజరైనవారిలో కంగారు మొదలైంది.

ఇప్పటికే వసుంధర రాజె, ఆమె తనయుడు దుష్యంత్ సెల్ఫ్‌ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాను కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టు ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశంలో దుష్యంత్ తో కలిసి రెండు గంటలపాటు వున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగించడం మంచిది కాదన్నారు ఓబ్రెయిన్

కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్నా.. నిర్లక్ష్యం ఏ రేంజ్‌లో ఉందో కనికా కపూర్‌ ఉదంతం బట్టబయలు చేస్తోంది. మరోవైపు... ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అలర్ట్‌ అయింది. కనిక కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టారు. ఆమె ఎవరెవరికి పార్టీ ఇచ్చింది.. ఎంత మంది వచ్చారు.. వాళ్లంతా ఎక్కడ తిరిగారు.. ఎలా ఉన్నారనే కోణంలో దృష్టి సారించారు.

Tags

Read MoreRead Less
Next Story