కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు

కరోనా కట్టడి కోసం ఏపీలో పలు చర్యలు తీసుకుంటున్నారు.. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు కోటి 41 లక్షల కుటుంబాలకు గాను.. కోటి 33 లక్షల ఇళ్లను సర్వే చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతీ పట్టణ, గ్రామాల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించామన్నారు. వీరిని స్థానిక పీహెచ్‌సీల ద్వారా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల స్వీయ నిర్బంధంలో తప్పనిసరిగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు..ఏపీలో ఇప్పటివరకు 1,006 మంది అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. 28 రోజుల పరిశీలన తర్వాత 259 మందిని ఇళ్లకు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 711 మంది ఇళ్లలోనే స్వీయనిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 135 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 108 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. 3 కోరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 24 మంది శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉంది.

విదేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వ్యాపిస్తుండటంతో విశాఖ ఎయిర్‌పోర్టుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటి వరకు 9 వేల 261 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు..కేంద్ర ఆదేశాల మేరకు ఆదివారం నుంచి వారం పాటు విశాఖ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ మూతపడనుంది.

కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన విధంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు నివాసాల్లోనే ఉండాలని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకుండా కాల్‌ సెంటర్‌ను సంప్రదించి వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలన్నారు. తాను కూడా నెలాఖరు వరకు తన పర్యటనలు రద్దు చేసుకున్నట్టు గవర్నర్ తెలిపారు...

ఏపీలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్ని ఈ అర్ధరాత్రి నుంచే ఆపేస్తారు..ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని ప్రభుత్వం కోరింది. అటు పెట్రోల్‌ బంకులు కూడా మూతపడనున్నాయి.అత్యవసర వాహనాలకే పెట్రోలు, డీజిల్‌ పంపిణీ చేస్తారు. బంకుల్లో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంటారు..

ఏపీల కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్‌,ఎస్పీ సహా 18 మందితో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఛైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌గా డీఎంహెచ్‌వో, సభ్యులుగా మున్సిపల్‌ కమిషనర్లు, ఐసీడీఎస్‌ పీడీ, రైల్వే, విమానాశ్రయ అధికారులు ఉంటారు...

కరోనా దృష్ట్యా సచివాలయంలో ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 23 నుంచి ఉద్యోగులు మినహా ఇతరులు ఎవరినీ అనుమతించరు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం అనుమతి ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. ఈమేరకు సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. పరిస్థితి మెరుగయ్యేవరకు ఈ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో దర్శనాలు నిలిపివేయడంతో ఏడు కొండలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. శ్రీవారి భక్తులకోసం సిద్ధం చేసిన లడ్డూ నిల్వలు పేరుకుపోయాయి. ముందుగా తయారు చేసిన దాదాపు 2లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. ఈ లడ్డూలన్నీ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిచింది.

Tags

Read MoreRead Less
Next Story