ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు.. మార్చి 31 వరకు లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు..  మార్చి 31 వరకు లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. సౌదీ అరేబియా నుంచి విశాఖపట్నం వచ్చిన రోగికి దగ్గరి వ్యక్తి అయిన 49 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్న వ్యక్తికి సోకిన తొలి కరోనా పాజిటివ్ కేసుగా ఇది నిలిచింది. అలాగే ఏపీలో కరోనా సోకిన మొదటి మహిళ కూడా ఈమే కావడం గమనార్హం. దీంతో విదేశాల నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని సూచించిందివైద్య ఆరోగ్యశాఖ.

ఇప్పటివరకు విదేశాల నుంచి ఏపీకి 13,301 మంది వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 11,206 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. 2,222 మందికి ఇంట్లోనే 28 రోజుల ఐసోలేషన్‌ పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. 53 మందిని ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది. మరో 16 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వివరించింది. కాగా, నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని, అతడిని త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అటు రోజురోజుకు కరోనా విస్తరిస్తుండటంతో.. ఏపీ సర్కారు అల్టైంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సర్వీసుల నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు సీఎం జగన్.

పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తూ, ప్రతి ఇంటికి వెయ్యి ఆర్థికసాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్‌ అందుబాటులోకి ఉంటుందని, రేషన్‌ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న వెయ్యి రూపాయలు అందిస్తామ్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అందరూ 14 రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారు. సోమవారం జరగాల్సిన చివరి ఇంటర్‌ పరీక్ష సైతం వాయిదా పడింది. త్వరలోనే వాయిదా పడిన పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story