విశాఖలో 1470 మంది హోమ్‌ క్వారంటైన్‌

విశాఖలో 1470 మంది హోమ్‌ క్వారంటైన్‌

కరోనా కట్టడి కోసం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై ప్రధానంగా దృష్టిపెడుతోంది ఏపీ ప్రభుత్వం. విశాఖలో ఇప్పటికే 1470 మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కేంద్రం పంపిన జాబితాలో ఆ సంఖ్య 2, 400గా ఉంది. దీంతో మిగతా వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి హైరిస్క్‌జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. సీతమ్మధారలో 470 మంది, గాజువాకలో 500 మంది వరకూ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీ ప్రయాణికులకు ఒక అధికారిని కేటాయించారు. ప్రతి పంచాయతీలోనూ కార్యదర్శులను ప్రత్యేకాధికారిగా నియమించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అటు నిత్యావసరాల ధరలు పెంచినా , కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది..

కరోనాను ప్రతి ఒక్కరు సీరియస్‌గా తీసుకోవాలన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకురావాలన్నారు. జిల్లాల సరిహద్దులపై గట్టి నిఘా పెట్టామన్నారు డీజీపీ.

లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. వాహనాలతో రోడ్లపైకి వచ్చేస్తున్నారు..దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలను మరింత కఠినతరం చేశారు అత్యవసర పనులుంటే తప్ప ప్రజలెవరూ రోడ్ల మీదకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వినకుండా ఎవరు బయటకు వచ్చినా.. వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. పలుచోట్ల లాఠీలకు పనిచెప్పారు.

అయితే పల్లెల్లో మాత్రం చైతన్యం వెల్లివిరుస్తోంది. పలు గ్రామాల్లో కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.. మొత్తం ఊళ్లనే లాక్‌డాన్ చేస్తున్నారు. ఇతర గ్రామాల ప్రజలెవరూ లోనికి రాకుండా సరిహద్దులను మూసివేస్తున్నారు..రోడ్లకు అడ్డంగా దుంగలుపెట్టి కంచెలు వేస్తున్నారు. పలుచోట్ల తమ గ్రామాల్లోకి ఇతరులెవరూ రావొద్దని బోర్డులు కూడా పెడ్తున్నారు..

లాక్‌డౌన్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సూచించారు. లాఠీపట్టుకొని రోడ్డుపైకి వచ్చిన ఆయన ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. కరోనా తీవ్రతను మైక్‌సెట్‌ ద్వారా ప్రజలకు వివరించారు. గుంటూరు జిల్లా బాపట్లలో మందుబాబులు కల్లు కోసం ఎగబడ్డారు. వైన్‌షాప్స్‌ క్లోజ్‌కావడంతో అంతా మద్దిబోయినవారి పాలెంకు కల్లు కోసం వచ్చారు. గుంపులు గుంపులుగా కల్లు సేవించారు.

Tags

Read MoreRead Less
Next Story