21 రోజులపాటు దేశవ్యాప్తంగా అమలుకానున్న లాక్ డౌన్

21 రోజులపాటు దేశవ్యాప్తంగా అమలుకానున్న లాక్ డౌన్

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 21 రోజులపాటు దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం అర్ధరాత్రి 12 నుంచే లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశ పౌరుల ప్రాణరక్షణ కోసం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

కరోనా మహమ్మారికి హిందీలో కొత్త అర్థం చెప్పారు ప్రధాని మోదీ. కరోనా అంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని అర్థం వచ్చేలా వివరించారు. కరోనా కట్టడికి సమాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామం, ప్రతి నగరం కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ.

ఎంతో అభివృద్ధి చెందిన ఇటలీ, అమెరికా లాంటి దేశాలే కరోనా మహమ్మారికి గడగడలాడిపోయాయని అన్నారు ప్రధాని మోదీ. ఆధునిక వైద్య సదుపాయాలు వున్న దేశాలు సైతం కరోనా ధాటిని తట్టుకోలేక విలవిలలాడాయని అన్నారు. అందువల్ల కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదని తెలిపారు. 21 రోజుల పాటు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story