భయపెడుతున్న లెక్కలు.. 24 గంటల్లో 63 వేల కేసులు.. క్యా 'కరోనా'

భయపెడుతున్న లెక్కలు.. 24 గంటల్లో 63 వేల కేసులు.. క్యా కరోనా

కంటికి కనిపించని కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచమంతా ఒకటే పాట.. కరోనా.. కరోనా.. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య.. మరణిస్తున్న వారి సంఖ్య నిన్నటి కంటే ఈ రోజు.. ఈ రోజు కంటే రేపు ఎక్కువలా వుంది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లాక్‌డైన్ ఎంచుకుంటున్నాయి కరోనా బారిన పడ్డ దేశాలు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు ఏడు లక్షలు దాటిందని అంచనా. వీరిలో 30 వేల మందికి పైగా కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆదివారం ఉదయం నాటికి 24 గంటల్లో 63,159 మంది కొత్తవారిలోకి ఈ వైరస్ ప్రవేశించిందని తేలింది.

ఐరోపా దేశాల్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇటలీలో వైరస్ విస్తరిస్తున్న కారణంగా కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు కనీస అవసరాలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక్కరోజులోనే 838మందిని ఈ వైరస్ బలిగొందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక స్పెయిన్‌లో అయితే ఆదివారం ఒక్కరోజే 6500 మంది వైరస్ బారినపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సైనికుల్ని రంగంలోకి దించి ప్రజల్ని కట్టడి చేయమని ఆంక్షలు జారీ చేసింది.

ఫ్రాన్స్ లెక్కలు చూస్తే నిన్న ఒక్కరోజే 292 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2,606కు పెరిగింది. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో వైరస్ సోకినవారు 40,174 మంది అని లెక్క తేలింది. కరోనాకి కారణమైన చైనాలో వైరస్ బాధితుల సంఖ్య 81,470కి పెరిగింది. దక్షిణకొరియాలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 158కి చేరుకుంది. బ్రిటన్‌లో ఇప్పటివరకు 1,228 మంది మృతి చెందారు. ఈ దేశంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి నాలుగు గంటలకు రెట్టింపవుతోందని కేబెనెట్ మంత్రి మైకేల్ గోవ్ తెలిపారు. వైరస్‌ని పూర్తిగా అరికట్టాలంటే మరో ఆరు నెలలు ఆంక్షలు తప్పవని బ్రిటన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హ్యారీస్ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story