కరోనా ఎఫెక్ట్ తో జీతాలు, పెన్షన్లలో భారీ కోత

కరోనా ఎఫెక్ట్ తో జీతాలు, పెన్షన్లలో భారీ కోత

కష్టమొస్తే పంచుకోవాలి.. ఇది లగ్జరి పిరియడ్ కాదంటూ ఆదివారమే చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏప్రిల్ ఒకటోతేదీ జీతాలిచ్చే పరిస్థితులపై లెక్కలన్నీ వేశాక సగానికి సగం కోతపెట్టాల్సిందేనని నిర్ణయించారు. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఆర్ధికంగా కాస్త పరిపుష్ఠిగా ఉన్నా.. కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతున్నందున ఇంతకు మించి మార్గం లేదన్నారు. ఆర్ధిక క్రమశిక్షణపై ఏమి చేయాలన్న దానిపై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు కేసీఆర్. సుదీర్ఘ చర్చల తరువాత వివిధ రకాల చెల్లింపుల్లో కోతలు పెట్టాలని ఆదేశించారు. రెవెన్యూ ఘోరంగా పడిపోయినందున చూసుకొని నడవక పోతే కష్టమన్నారు. తాజా నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత పెట్టాలని నిర్ణయించారు. అలాగే అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్ , ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల్లో 60 శాతం కోత విధించాలని నిర్ణయించారు. అంతేకాదు మిగతా అన్ని క్యాటగిరీల ఉద్యోగుల జీతాల్లో కూడా 50 శాతం కోత ఉండనుంది.

ఇక నాలుగోతరగతి, అవుట్ సోర్చింగ్, క్రాంటాక్టు ఉద్యుగుల వేతనాల్లో 10 శాతం తగ్గిస్తారు. వీరే కాక అన్ని రకాల రిటైర్డ్ ఉద్యుగుల పెన్షన్లపై కూడా 50 శాతం కోత విధించారు. అయితే నాలుగోతరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో మాత్త్రం 10 శాతం కోత విధిస్తారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ గ్రాంటులో పొందుతున్న సంస్థల్లోనూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే కోత ఉంటుంది. సమీప భవిషత్ లోనే ఎదురవబోతోన్న సవాళ్ళను ఎదుర్కోవాలంటే ఇంతకు మించిన మార్గం లేదని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి చక్కబడే వరకు జీతాల్లో కోత ఉంటుందని వివరిస్తున్నారు. ఏకంగా మూడు వారల పాటు లాక్ డౌన్ కు వెళ్లడమంటే ఎక్ససైజ్ ,పెట్రోల్ , gst వంటి వాటిపై వచ్చే ఆదాయం కనీసం 20 శాతం కూడా రాదని భావిస్తున్నారు. అందుకే జీతాలు సహా అన్నింట్లోనూ కోత తప్పదని అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ పధకాల అమలు వంటి సవాల్లో కూడా ఉన్న నేపథ్యంలో వేతనాల్లో కోత తప్ప మార్గం లేదన్నది సీఎంఓ చెబుతున్న మాట.

తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు సరాసరి నెలకు 10 వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుంది.. వీటిల్లో జీతాలు, పెన్షన్లకు సగానికి పైగా పోతుంది. సెంట్రల్ గ్రాంటులు, ఇతరత్రా రూపాల్లో మరో 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. వీటి ఆధారంగానే ప్రభుత్వం లెక్కలు వేసుకొని సంక్షేమ పధకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇతర బిల్లులు వంటివి చెల్లిస్తూ ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న రుణాల చెల్లింపులు కూడా ఈ డబ్బునుంచే చెయ్యాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ధిక క్రమశిక్షణ తోపాటు జీతాల్లో కోత పెట్టకపోతే ప్రభుత్వం గట్టెక్కడం కష్టమని భావించి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story