అమెరికాలో కరోనా కాటుకు 11 మంది భారతీయులు బలి..

అమెరికాలో కరోనా కాటుకు 11 మంది భారతీయులు బలి..

యునైటెడ్ స్టేట్స్‌లో కరోనా వైరస్ బారిన పడి 11 మంది భారతీయులు మరణించారు. వీరిలో పది మంది న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. మరణించిన వారిలో నలుగురు న్యూయార్క్ నగరంలో ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. మరో 16 మంది భారతీయులకు పాజిటివ్ అని తేలడంతో వారంతా స్వీయ నిర్భంధంలో ఉన్నారు. వీరంతా భారత దేశంలోని ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు.

అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఈ వైరస్ కారణంగా 6,000 మరణాలు సంభవించాయి. పాజిటివ్ కేసులు 1,38,000కు పైగా నమోదయ్యాయి. ఇక న్యూజెర్సీలో 1500 మరణాలు నమోదుకాగా, పాజిటివ్ కేసులు 48,000 ఉన్నట్లు తేలింది. కోవిడ్-19తో బాధపడుతున్న భారతీయ పౌరులకు, విద్యార్ధులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు స్థానిక సంస్థలు భారతీయ-అమెరికన్ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి. వైరస్ కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలు సైతం అధికారులే నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా దహన సంస్కారాలకు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని వారంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story