అమ్మ ప్రేమ.. కొడుకు కోసం 1400 కి.మీ..

అమ్మ ప్రేమ.. కొడుకు కోసం 1400 కి.మీ..

కొడుకు ఎక్కడో 700 కి.మీ అవతల ఉన్నాడు. అమ్మకి అన్నం సహించట్లేదు.. నిద్ర పట్టట్లేదు. బిడ్డని ఎలాగైనా ఇంటికి తెచ్చుకోవాలి. అనుకున్నదే తడవుగా అధికారులను కలిసింది. పరిస్థితి వివరించి 1400 కి.మీ స్కూటిపై ప్రయాణించడానికి అనుమతి పత్రం తీసుకుంది.

కామారెడ్డి బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 12 ఏళ్ల క్రితం భర్త మరణించడంతో ఒంటరిగా పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్నకొడుకు మహ్మద్ నిజాముద్దీన్‌కి డాక్టర్ చేయాలని ఆసక్తి ఉండడంతో అతడికి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ ఇప్పిస్తోంది. నిజాముద్దీన్ స్నేహితుడు నెల్లూరులో ఉండడంతో మార్చి 12న అక్కడికి వెళ్లాడు. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు. అసలే కరోనా వార్తలు.. కొడుకు దగ్గర లేడు.. ఆమెను ఒక చోట నిలవనీయలేదు.

వెంటనే వెళ్లి బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ఆయన ఇచ్చిన లెటర్ తీసుకుని 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు స్కూటీపై సోమవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ అదే స్కూటీపై బుధవారం మధ్యాహ్నానికి బోధన్ చేరుకున్నారు. కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలనే తపనే తనను అంత దూరం ప్రయాణించేలా చేసిందని రజియాబేగం అన్నారు. మధ్య మధ్యలో పోలీసులు ఆపినా లెటర్ చూపించడంతో అనుమతిచ్చారని అన్నారు. తనకు సహకరించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story