బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ కేంద్రం లాక్‌డౌన్ వాయిదా వేసింది: కమల్‌నాథ్

మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ కేంద్రం లాక్‌డౌన్ విధించడాన్ని వాయిదా వేసిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రిగా మార్చి 20 న నేను రాజీనామా చేశా. కానీ మార్చి 23న బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే లాక్‌డౌన్ ను ప్రకటించారు. భారత్ పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని రాహుల్ గాంధీ ఫిబ్రవరిలోనే హెచ్చరించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని తీవ్రంగా విమర్శించారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల.. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసుకున్నాయని.. కానీ పార్లమెంటు సమావేశాలు వాయిదావేయలేదని మండిపడ్డారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి తమ హయాంలో అనేక చర్యలు తీసుకున్నామని, జన సందోహం ఎక్కువగా ఉండే మాల్స్, స్కూల్స్ మూసివేయాలని మార్చి 8నే ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో కేంద్రం లాక్‌డౌన్ విధించకపోయినా.. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలకు ఆదేశించామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com