పోలీస్ సారూ.. దగ్గరకు రాకండి ప్లీజ్.. వీడియో వైరల్

పోలీస్ సారూ.. దగ్గరకు రాకండి ప్లీజ్.. వీడియో వైరల్

కరోనా గురించి ప్రపంచం మూల మూలలకు తెలిసింది. అంతగా అది మనిషి జీవితాలపై ప్రభావం చూపిస్తోంది. దేశాధ్యక్షుల్ని సైతం నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. బతికుంటే బలుసాకు తినొచ్చు. ఇంటి పట్టునే ఉండండి.. అంతకంటే మార్గం లేదు అని అంటున్నారు. ప్రజల్ని బయటకు రాకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైరస్‌ని కట్టడి చేయాలంటే.. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలనేది ప్రధానాంశంగా చెబుతున్నారు. అందుకే లాక్‌డౌన్ విధించి మరీ ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు.

శుభ్రత, మాస్కులు పెట్టుకోవడం అనేది తరువాతి సంగతి.. ముందైతే దూరంగా ఉండమంటున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇల్లు లేని నిరుపేదలు, రోజువారీ కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయం అందించే దిశగా చర్యలు చేపడుతున్నా.. కొందరికి చేరట్లేదు. తాజాగా కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన ఓ ఇల్లు లేని నిరుపేద వీధి అరుగు మీద పడుకుని ఉండడాన్ని గస్తీ తిరుగుతున్న పోలీసులు చూశారు. అతడిని అన్నం తిన్నావా లేదా అని అడిగితే తినలేదని చెప్పాడు. దీంతో పోలీసులు అతడికి ఆహారం తీసుకువచ్చి అందించబోయారు. కానీ ఆ వ్యక్తి సార్ దగ్గరకు రాకండి. ఇదిగో ఇక్కడ పెట్టండి ఆ అన్నం పొట్లం అని పోలీసులను దూరంగా ఉండమని ఓ చిన్న గీత గీశాడు.

ఏం చదువుకున్నాడో ఏమో తెలియదు కానీ.. చదువుకున్న వాళ్లు చెబుతున్నా వినట్లేదు. అతడు మాత్రం ప్రభుత్వం మాటని అక్షరాలా పాటిస్తున్నాడు అని పోలీసులు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్స్ పోలీసుల ఉదార స్వభావాన్ని మెచ్చుకుంటున్నారు. ఆ వ్యక్తిలోని చైతన్య స్ఫూర్తిని అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story