యజమాని ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలు కోల్పోయి..

యజమాని ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలు కోల్పోయి..

పెంపుడు జంతువులు.. యజమానుల ప్రియమైన నేస్తాలు. ప్రాణంగా ప్రేమించే యజమానులకు ఏదైనా అపాయం పొంచి ఉందంటే చూస్తూ ఊరుకోవు. తమ ప్రాణమిచ్చి యజమాని రుణం తీర్చుకుంటాయి.. విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి. యజమానుల ప్రేమకు పాత్రులవుతాయి. ఏ జన్మ అనుబంధమో వారికి స్నూఫీతో. అందుకేనేమో వారి చెంత చేరింది.

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన ఆర్ఎమ్‌పీ వైద్యుడు కిషోర్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి స్నూఫీ అని పేరు పెట్టి పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు. ఇంట్లో అందరికి స్నూఫీ అంటే చాలా ఇష్టం. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న కిషోర్ ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి మంచం మీద కాస్త నడుం వాల్చారు. ఈ లోపు ఎక్కడి నుంచో ఓ త్రాచు పాము ఇంట్లోకి వస్తోంది. అది గమనించిన స్నూఫీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ పెనుగులాటలో పాము స్నూఫీని కాటేసింది.

అయినా తన ప్రయత్నాన్ని విడవకుండా పాము యజమాని దగ్గరకు వెళ్లకుండా నివారించింది స్నూఫీ. ఇంతలో ఆ అలికిడికి మేల్కొన్న కిషోర్ వెంటనే కర్ర తీసుకుని పాముని చంపేశాడు. స్నూఫీ పాము కాటుకు గురైందని తెలుసుకుని పశువైద్యశాలకు తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే శునకం యజమాని చేతిలో ప్రాణాలు విడిచింది. యజమాని కోసం స్నూఫీ తన ప్రాణాలు ఒడ్డి పోరాడిందని తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోతున్నారు. స్నూఫీ మరణం కిషోర్ ఇంట విషాదాన్ని నింపింది.

Tags

Read MoreRead Less
Next Story