మటన్ పేరుతో బీఫ్ అమ్మకాలు.. అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలు

భాగ్యనగర మటన్ ప్రియులను కలవరపెట్టే అంశం. నగరంలో పలు చోట్ల మటన్ దుకాణం పేరుతో బీఫ్ అమ్మకాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న వెటర్నరీ అధికారుల బృందం జీహెచ్‌ఎంసీలో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా. బాబు నేతృత్వం వహించారు. తనిఖీలో భాగంగా అసిఫ్ నగర్, బార్కాస్, మణికొండ, జియాగూడ, గోల్కొండ, గచ్చిబౌలి, జుబ్లీహిల్స్, ఉప్పల్, అంబర్‌పేట్, నాంపల్లి, రెడ్ హిల్స్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లోని పలు మటన్ దుకాణాల్లో బీఫ్ (గొడ్డు మాంసం) అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 62 మటన్ దుకాణాలు గుర్తిస్తే వాటిల్లో 50 దుకాణాలకు లైసెన్స్‌లు లేవు. ఒక దుకాణంలో బీఫ్ మాంసాన్ని గుర్తించిన అధికారులు దానిపై ఫినాయిలో పోశారు.
ఇదిలా ఉండగా కరోనా విపత్తు సమయంలో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో మటన్ ధరను రూ.800 నుంచి రూ.950 లకు అమ్ముతున్నారు. రాష్ట్ర పశసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఇతర అధికారులతో చర్చించి మటన్ కిలో రూ.700, చికెన్ కిలో రూ.160కి మించి అమ్మరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఒక దుకాణంలో అయితే కంపెనీ బ్రాండ్ పేరుతో కిలో మటన్‌ని రూ.1,100 కు అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా అక్రమ వ్యాపారం సాగించినట్లైతే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవలసి వుంటుందని అధికారులు దుకాణ దారులకు విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com