కరోనాకి ముందు చాలా వైరస్‌లు..

కరోనాకి ముందు చాలా వైరస్‌లు..

ఇంతకు ముందు వచ్చిన వైరస్‌లను ఎన్నింటినో ఎదుర్కొన్నాం. మరిప్పుడు కరోనాకి మాత్రం ఎందుకింత భయపడుతున్నాం. నిజానికి కోవిడ్-19 తో పోల్చితే వాటి మరణాల రేటు చాలా ఎక్కువ. అయినా వాటిపై విజయం సాధించాం. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కొన్ని కోట్ల మందిని బలితీసుకుంది. మరికొన్ని వైరస్‌లు మనుషుల్ని మట్టుపెట్టడానికి వచ్చినా మానవ రోగ నిరోధక వ్యవస్థ వాటితో పోరాడి గెలిచింది. కొన్ని వైరస్‌లో టీకాలు కనుగొన్నారు.

కొన్నింటిని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేస్తూ వివిధ చికిత్సా విధానాలను అవలంభిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇతర వైరస్‌లతో పోల్చి చూసినప్పడు మరణాల రేటు తక్కువే. అది కూడా కరోనా వైరస్ సోకిన ఇతర అనారోగ్య సమస్యలున్నవారే మృత్యువాత పడుతున్నారు.

కరోనాకి ముందు వచ్చిన కొన్ని వైరస్‌ల గురించి..

'ఎబోలా'.. ఈ వైరస్‌ను మొట్టమొదటి సారి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గుర్తించారు. 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో వేగంగా విస్తరించిన ఈ వైరస్ 28,610 మందికి సోకగా అందులో 11,308 మందిని బలితీసుకుంది. 2018లో 3,432 మందికి వైరస్ సోకగా 2,249 మంది చనిపోయారు. దీనికి కూడా ఇంతవరకు టీకా కనిపెట్టలేదు.

'మెర్స్'.. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైంది. అరుదుగా వ్యాపించే ఈ వైరస్ తీవ్రత సౌదీ అరేబియాలో ఎక్కువ. 2012లో దీన్ని గుర్తించారు. 2,449 మందికి మెర్స్ వైరస్ సోకితే అందులో 861 మంది మరణించారు. దీనికి కూడా టీకా లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా వివిధ రకాల ఫ్లూ జ్వరాల బారిన పడి దాదాపు 6 లక్షల మంది చనిపోతున్నారు. వాటిని కట్టడి చేసే ప్రయత్నంలో అనేక రకాల మందులను ప్రయోగిస్తున్నారు. ఫలితంగా ఫ్లూ జ్వరాలతో మరణించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.

'హెపటైటిస్'.. వీటిలో ఏ,బీ,సీ,డీ అని నాలుగు రకాలు ఉన్నాయి. ఈ వైరస్ 2015 సంవత్సరంలో 13 లక్షల మందికి పైగా బలితీసుకుంది. ఏటా లక్షల సంఖ్యలో హెపటైటిస్ సీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 96శాతం మరణాలు హెపటైటిస్ బీ,సీ వల్లే సంభవిస్తున్నాయి. హెపటైటిస్ సీ సోకిన వారు కాలేయ సంబంధిత వ్యాధితో చనిపోతున్నారు.

'హెచ్‌ఐవీ'.. దీన్ని గుర్తించిన తొలినాళ్లలో కొన్ని కోట్ల మంది మరణించారు. ఇప్పుడు కేసుల సంఖ్య లక్షల్లోకి చేరింది. ఎయిడ్స్ రోగులకు ఔషధాలు,

జీవితకాలాన్ని పెంచే మార్గాలు అన్వేషించి సక్సెస్ అయ్యాము. ఇప్పుడు ఈ కరోనాని ఎదిరించడం కూడా అంత కష్టమైన పనేం కాదంటున్నారు పరిశోధకులు. ఆ ఆశతో వారు తమ పరిశోధనలను ముందుకు సాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story