కరోనా రోగుల సేవలో ఇండియన్‌ డాక్టర్.. దుబాయ్ పోలీసుల సెల్యూట్‌

కరోనా రోగుల సేవలో ఇండియన్‌ డాక్టర్.. దుబాయ్ పోలీసుల సెల్యూట్‌

అయేషా సుల్తానా.. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ వైద్యురాలు. కోవిడ్ బాధితుల సేవలో నిమగ్నమై ఉన్న ఆమె విధులు ముగించుకుని తెల్లవారు ఝామున ఒంటిగంట ప్రాంతంలో షార్జాలోని తన ఇంటికి వెళుతోంది. పోలీసులు ఆమె కారుని అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నారని ఆరా తీసారు. దానికి ఆమె తను ధరించే తెల్ల కోటుతో పాటు, మెడికల్ ఫైల్‌ని కూడా చూపించారు. అవేవీ చూడకుండానే పోలీసులు ఆమెకు వందనం చేశారు.

కోవిడ్ బాధితులకు సేవలో అహర్నిశలు శ్రమిస్తున్న మీకు వందనం తల్లీ అని అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులంతా కలిసి ఆమెకు సెల్యూట్ చేశారు. ఊహించని ఈ పరిణామానికి అయేషా కళ్లు చెమర్చాయి. ఈ విషయాన్ని డాక్టర్ అయేషా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వందనం తనను కదిలించిందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అప్పటి వరకు డ్యూటీ చేసి వచ్చిన తన అలసట అంతా ఎగిరిపోయిందని అన్నారు.

ఓ డాక్టర్‌ పట్ల వారు చూపించిన అభిమానం అనిర్వచనీయం అని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వారు చూపించిన గౌరవం డాక్టర్ వృత్తిపై నాకున్న ప్రేమను మరింత పెంచింది అని ఆమె రాసుకొచ్చారు. దుబాయ్ ప్రభుత్వ మండలి కార్యదర్శి నార్మల్ అబ్దుల్లా అల్ బస్తీ, డాక్టర్ అయేషా పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసి దుబాయ్ పోలీసుల పని తీరును ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story