చిన్న ఉద్యోగం.. అయినా చేస్తా సాయం..

చిన్న ఉద్యోగం.. అయినా చేస్తా సాయం..
X

కరోనా మనుషుల మనసుల్లోకి కూడా చొరబడిందేమో. మానవత్వాన్ని తట్టి లేపుతోంది. మా వంతు సాయం మేమూ చేస్తామంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 10వేల రూపాయలు విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకుంది. చేసేది చిన్న ఉద్యోగం.. అయినా పెద్ద మనసుతో సాయం అందించింది అలివేలు. ఆమె పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్లో కూలీ. ఇద్దరు పిల్లలు. అమ్మానాన్న పొద్దంతా కష్టపడుతుంటారు. పిల్లలు సర్కారు బడిలో చదువుకుంటున్నారు. ఆమెకు నెలకు వచ్చే జీతం 12,000. అందులో 10వేలు రూపాయలు మంత్రి కేటీఆర్‌కు అందించింది.

అలివేలు మంచి మనసుకు ముగ్ధుడైన మంత్రి ఆమెతో కాసేపు ముచ్చటించారు. కుటుంబానికి ఎప్పుడైనా అండగా ఉంటానని, ఏ సాయం కావాలన్నా అడగమని చెప్పారు. అందుకామె తను ప్రతిఫలం ఆశించి సాయం చేయలేదని, కష్టకాలంలో ఉన్న ఇతరులకు సాయం అందించాలన్నదే తన కోరిక అని మంత్రికి సమాధానం ఇచ్చింది. నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇస్తానంటే ఇరుగుపొరుగు ఎవరూ ఒప్పుకోలేదని, అయితే తన భర్త, పిల్లలు మాత్రం తన ఆలోచనకి అండగా నిలిచారని తెలిపింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తూ కరోనా పోరులో ముందు వరుసలో ఉన్న అలివేలు, ఇప్పుడు విరాళం కూడా ఇచ్చి అందరి మన్ననలు అందుకుంది. ఆమె పారిశుద్ధ్య కార్మికుల అందరి గౌరవాన్ని పెంచిందని మంత్రి కేటీఆర్ అలివేలును ప్రశంసించారు.

Next Story

RELATED STORIES